Thursday, September 25, 2014

Milkmaid & Priest -పాలు తెచ్చే గొల్లత & పూజారి

  •  
 
  • రామనామ మహిమ

రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజున ఆమె వేళతప్పి వచ్చింది. 'నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటీ?' అని అడిగాడతడు. 'ఏరు దాటి రావాలికదా బాబూగారూ! పడవవాడు ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఇంత జాగు' అంది ఆమె.  అప్పుడా పూజారి 'ఓహో! పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటీ? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా?' అన్నాడు పరిహాసంగా.  మరునాటి నుంచీ ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది. 'ఫరవాలేదే! ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే!' అంటూ మెచ్చుకున్నాడు పూజారి.  'మీరు చేసిన ఉపకారమే కదా బాబూ! డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు' అంది గొల్లత, కృతజ్ఞతాపూర్వకంగా.

'ఉపాయమా? నేను చెప్పానా!' అన్నాడు పూజారి ఆశ్చర్యంగా.  'రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు? రామారామా అనుకుంటూ ఏటిమీద నడిచి వచ్చేస్తున్నాను' అంది ఆమె.  ఇలా అంటున్నదేమిటీ అనుకున్నాడతను. 'ఏదీ చూద్దాం పద!' అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. 'రామరామరామరామ...' అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది.  పూజారి పంచెపైకెత్తి పట్టుకుని, 'రామరామరామ..' అంటూ మోకాటిలోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు.  'మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండీ బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటీ!' అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత.  పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు.

  • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
  • ============================================ 

No comments:

Post a Comment