Thursday, September 25, 2014

The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం

  •  

  • The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు.  ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు.  మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు.  ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా.  మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది.   ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా.  ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు.  మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.

అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది.  వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ.  'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా.  ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా.  ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌.  అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

  • -గుడిపూడి రాధికారాణి@ఈనాడు న్యూస్ పేపర్ 
  • ============================================ 

King .cook.Minister- రాజు.వంటవాడు.మంత్రి

  •  


  • wonderful dish-అపురూప వంటకం
    విశాలనగర రాజు రాజీవుడికి తిండి ధ్యాస ఎక్కువ. అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడిని వంటవాడిగా నియమించాడు. ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజీవుడికి వండి వడ్డిస్తున్నాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచిల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంటకాలను నేర్చుకుని వచ్చి, రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు నాలుగు రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తున్నాడు.   ఈ మధ్య అలకనందుడి వంటల్లో పస తగ్గినట్టు రాజుకు సందేహం వచ్చింది. వెంటనే వంటవాణ్ని పిలిపించాడు.  'ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు. కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏవీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి. లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది' అని హెచ్చరించాడు రాజు.ఆ మాటలకి ముందుగా అలకనందుడు బయపడిపోయాడు. తర్వాత తేరుకుని 'మహారాజా! మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండిపెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడ్డానికి రెండ్రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పని చేయదు' అన్నాడు అలకనందుడు.
    ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు.  చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు ఘుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. రెండ్రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి, ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురంటూ తినేశాడు.  'అబ్బో! అద్భుతం! అమోఘం! చాలా రుచిగా ఉంది అలకనందా! నేనింత వరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు' అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు.  'కృతజ్ఞతలు మహారాజా!' అని వంగి వంగి దణ్నాలు పెట్టాడు అలకనందుడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ని పక్కకి తీసుకెళ్లి అడిగాడు.  'అలకనందా! ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది!' అని అడిగాడు.  'మహామంత్రీ! నన్ను మన్నించండి. ఏ వంటకం రుచి అయినా దాన్ని తినే వారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరోటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పడూ చేసిన వంటనే అమృతంలా ఉందనుకుంటున్నారు' అని అన్నాడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి.
  • - చొక్కాపు వెంకటరమణ@ఈనాడు న్యూస్ పేపర్ 
  • ============================================ 

Milkmaid & Priest -పాలు తెచ్చే గొల్లత & పూజారి

  •  
 
  • రామనామ మహిమ

రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజున ఆమె వేళతప్పి వచ్చింది. 'నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటీ?' అని అడిగాడతడు. 'ఏరు దాటి రావాలికదా బాబూగారూ! పడవవాడు ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఇంత జాగు' అంది ఆమె.  అప్పుడా పూజారి 'ఓహో! పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటీ? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా?' అన్నాడు పరిహాసంగా.  మరునాటి నుంచీ ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది. 'ఫరవాలేదే! ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే!' అంటూ మెచ్చుకున్నాడు పూజారి.  'మీరు చేసిన ఉపకారమే కదా బాబూ! డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు' అంది గొల్లత, కృతజ్ఞతాపూర్వకంగా.

'ఉపాయమా? నేను చెప్పానా!' అన్నాడు పూజారి ఆశ్చర్యంగా.  'రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు? రామారామా అనుకుంటూ ఏటిమీద నడిచి వచ్చేస్తున్నాను' అంది ఆమె.  ఇలా అంటున్నదేమిటీ అనుకున్నాడతను. 'ఏదీ చూద్దాం పద!' అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. 'రామరామరామరామ...' అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది.  పూజారి పంచెపైకెత్తి పట్టుకుని, 'రామరామరామ..' అంటూ మోకాటిలోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు.  'మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండీ బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటీ!' అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత.  పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు.

  • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
  • ============================================ 

Way to Treasure-నిధికి దారి

  •  

  • Way to Treasure-నిధికి దారి

గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికిరానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.  'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి. గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా! అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్థులంతా ఓరోజు త్రిగుణయ్యను చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ మండిపడ్డారు.  త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి 'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.  ఆ సన్యాసి కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.  'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.  అంతా విన్న వూరిపెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని పాడుపెట్టుకున్నాం' అన్నాడు. గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగుచేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవరికీ చెప్పలేదు.

  • -కె.కె. రఘునందన@ఈనాడు న్యూస్ పేపర్ 
  • ============================================

No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ?



  •  No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ?

హిమాలయాలలో నిధి నిక్షేపాలుంటాయని ఎందరో చెబితే, వాటిని సాధించి తెచ్చుకుందామని నలుగురు మిత్రులు బయలుదేరారు. అక్కడ వాళ్లకు ఒక సిద్ధుడు కనిపించాడు. అతడు వాళ్ల ప్రార్థన ఆలకించి, తలా ఓ ఉంగరం వేలికి తొడిగి, 'కొండల్లో, అడవుల్లో తిన్నగా వెళ్లండి. మీ వేలికున్న ఉంగరం ఎక్కడ జారిపడుతుందో, అక్కడ తవ్వండి. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో మరి!' అన్నాడు. గునపాలు, గోనె సంచులు పట్టుకుని వాళ్లు కనుమ దారి పట్టారు. అలా రెండు రోజులు నడిచేసరికి ఒకడి ఉంగరం జారి కింద పడింది. వాడు అక్కడ తవ్వాడు. బండెడు రాగి ఇటుకలు కనిపించాయి. 'వీటిని తీసుకెళ్లి అమ్ముకుందాం. చాలా డబ్బొస్తుంది' అన్నాడు. 'మేం ఇంకా ముందుకెళ్తాం' అన్నారు మిగతా వాళ్లు. మొదటివాడు రాగి ముద్దలు తీసుకుని వెళ్లిపోయాడు. ముగ్గురు మిత్రులూ మరో రెండు రోజులు నడవగానే రెండోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే, వెండి దిమ్మెలు బయట పడ్డాయి. వాడు వాటిని తీసుకోగా మిగిలిన ఇద్దరూ ముందుకు సాగారు. తర్వాత మూడోవాడి ఉంగరం జారి పడింది. అక్కడ తవ్వితే బంగారం బయటపడింది. వాడు సంబరపడి, 'ఇద్దరం పంచుకుని వెళ్లిపోదాం!' అన్నాడు. 'నువ్వెళ్లు. నేనురాను! నాకు వెలకట్టలేని మణిమాణిక్యాలు దొరకవచ్చుకదా!' అంటూ నాలుగోవాడు ముందుకు సాగిపోయాడు. వాడు చాలా దూరం నడిచి, ఓ పెద్దలోయ అంచున ఆగాడు. అక్కడ వాడి ఉంగరం జారి ఆ లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. లోయ చుట్టూ రాతిగోడల్లా నిటారుగా కొండలు! వాడు అతి కష్టం మీద లోయలోకి దిగాడు. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. దుబ్బులా పెరిగిన గడ్డమూ మీసాలతో ఓ పిచ్చివాడు కనిపించాడు. మణులూ మాణిక్యాలూ పొదిగిన ఓ పెద్దచక్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ, వాడి తల మీద గిరగిరా తిరగుతోంది. ఎటు వెళితే అటు వాడితో బాటే వస్తోంది. 'భయపడకు!' అంటూ దగ్గరికి వచ్చాడు వాడు.  'నేనూ నీలాగా వచ్చిన వాణ్నే! ఇప్పుడు నేను నీకు కనిపించినట్లే, అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూ ఒకడు నాకు కనిపించాడు. వాణ్ని వదిలేసి ఇది నన్ను పట్టుకుంది. మణి మాణిక్యాలు లభించాయన్న సంతోషం క్షణమైనా లేకపోయింది. ఈ చక్రం నెత్తి మీది నుంచి దిగదు. ఇంటికి పోదామంటే చక్రాన్ని మోసుకుంటూ కొండలు ఎక్కలేను. ఎవరొస్తారా అని ఎదురుచూస్తూ, ఆకులలములతో ప్రాణం నిలుపుకుంటున్నాను. నా పాలిట దేవుడిలా ఇన్నాళ్లకు నువ్వొచ్చావు' అంటూ చేతులు మోడ్చాడు.  వెంటనే ఆ చక్రం గిర్రున తిరుగుతూ, నాలుగో మిత్రుడి తలమీదికెక్కింది. వాడు ఆర్తనాదాలు చెయ్యసాగాడు.  'మరేం దిగులు పడకు! మన లాంటి వాడు మరొకడెవడైనా వచ్చి నిన్ను రక్షించేదాకా వేచి చూస్తూ ఉండు!' అని ధైర్యం చెప్పి, ఆ పిచ్చివాడు లోయలోంచి బయటపడ్డాడు.

  • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
  • ============================================ 

Wednesday, September 24, 2014

Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

  •  

  • Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో 'నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను' అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి 'సరే మహారాజా' అన్నాడు.

'అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ దానిదే. కాదంటావా?' అన్నాడు రాజు నవ్వుతూ. 'అది నిజం కాదు మహారాజా! వస్తువు విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది' అన్నాడు విదూషకుడు.
'అలా అని నిరూపించగలవా?' అన్నాడు రాజు. 'మీ చేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి ప్రభూ' అన్నాడు విదూషకుడు. రాజు వెంటనే తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి ఇచ్చి, 'మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి ఎంతకి కొంటాడో అడిగిరా' అంటూ పంపాడు.  అలా వెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, 'ఇరవై వరహాలు ఇస్తానన్నాడు ప్రభూ' అన్నాడు. విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని పిలిచి కడియం ఇచ్చి 'మాధవయ్య దీన్ని ఎంతకు కొంటాడో కనుక్కో' అని పంపాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఆ అధికారి, 'నలభై వరహాలు ఇస్తానన్నాడు' అన్నాడు. తర్వాత విదూషకుడు దారినపోయే బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి దగ్గరకు పంపాడు. అతడి వెంట ఓ సైనికుడిని రహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి, 'అయ్యా! దీని ధర ఎంత?' అని అడిగాడు. వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి చేతిలో పెట్టి, 'దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి ఉంటావు. మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు చేస్తాను' అంటూ దబాయించాడు. ఆపై సైనికుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు, రాజు కేసి తిరిగి 'చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే వర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల, బీదవాడికి ఒక ధర చెప్పాడు. వస్తువు విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?' అన్నాడు. రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి ఇచ్చాడు.

  • -పుప్పాల కృష్ణమూర్తి@ఈనాడు న్యూస్ పేపర్ 
  • ==============================

Bet with higher cadre not good-అధికులతో పోటీకి దిగటం అనర్థం

  •  
 
  • Bet with higher cadre not good-అధికులతో పోటీకి దిగటం అనర్థం

ఓ పెద్ద సరస్సు. రకరకాల నీటి పక్షులతో కళకళలాడుతూ ఉండేది. అందమైన రాయంచలెన్నో అక్కడ విహరిస్తుండేవి.

ఆ పరిసరాలలో ఉన్న కాకికి హంసలపట్ల అసూయకలిగింది. తెల్లటి ఈకలతో, అవి సుందరంగా ఉన్నాయి. వాటి స్వరాలు వీనుల విందుగా రాగాలు పలుకుతుంటాయి. తానేమో అందంగా లేదు. తన కూత కర్కశంగా ఉంటుంది. హంసల్ని మెచ్చుకునే వాళ్లెవరూ తనవైపు చూడనైనా చూడరు. అందుకే వాటికి అంత గర్వం! వాటి పొగరణచాలన్న గట్టి కోరిక కాకికి కలిగింది.

అది సరస్సు నడుమ వొయ్యారంగా ఈదులాడుతున్న హంసలరాజు తల చుట్టూ ఎగురుతూ, 'ఏమోయ్‌! నువ్వేనా హంసల రాజువి? నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావ్‌? ఎందులో నీ గొప్ప? మా కాకులకంటే మిన్నగా నువ్వెగరగలవా? నాతో పందెం కాయి చూద్దాం!' అంది డాంబికంగా.

'నీతో నాకెందుకు పోటీ?' అంది రాజహంస సౌమ్యంగా. 'భయపడుతున్నావా?' అంటూ హేళనగా నవ్వింది కాకి. ఒంటి రెక్కతో కాసేపు, వంకరటింకరగా కాసేపు, పల్టీలు కొడుతూ కాసేపు ఎగిరి చూపించింది. 'చూశావా నా విన్యాసాలు? నువ్వు నన్ను గెలవలేవు' అంది అట్టహాసంగా.

'ఆకాశంలో నాకంటే ఎక్కువ సేపు ఉండగలనన్న నమ్మకం నీకుంటే, పోటీకి సిద్ధమే!' అంది హంస.

ఆ రెండూ ఒక్కసారిగా ఆకాశంలోకి లేచాయి. కాకి వేగంగా ముందుకెళ్లిపోయింది. వెనక వస్తున్న హంసను అపహాస్యం చేసింది.

హంస మెల్లగా ఎత్తులకెగురుతూ, 'ఏదీ, నాలాగా మేఘాలను దాటుకో చూద్దాం' అంది. హంస కంటే తక్కువ కాకూడదని కాకి కూడా పైపైకి పోసాగింది. అప్పటికి అది అలిసి పోయింది. కళ్లు బైర్లు కమ్మాయి. అది గమనించిన హంస 'ఇక నీ వేగం ఏ పాటిదో చూపించు' అంటూ ముందుకు దూసుకుపోసాగింది. ఆ వేగాన్ని అందుకోవడం కాకికి సాధ్యం కాలేదు. చాలా దూరం వెళ్లాక, దానికి రెక్కలాడించడమే కష్టమైపోయింది. గుండె పగిలి పోయేలా రొప్పుతూ, కింద ప్రవహిస్తున్న ఓ నదిలో దబుక్కున పడిపోయింది. 'హంస రాజా! నన్ను కాపాడు. నేను ఓడిపోయాను. నా ధిక్కారాన్ని మన్నించు' అని వేడుకుంది కాకి.

హంస కిందికి వచ్చి, మునిగిపోతున్న కాకిని పైకి లాగి వీపున వేసుకుని దాని గూటికి చేర్చింది. 'అధికులతో పోటీకి దిగటం అనర్థమని తెలిసొచ్చింది..' అంటూ లెంపలు వేసుకొంది కాకి.
  • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
  • ============================================ 

Hundredth Strike-వందో దెబ్బ

  •  

  •  Hundredth Srike-వందో దెబ్బ

దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు. ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు. మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది. దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది. వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు. జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు. కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది. అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.

'ఏదీ మరో వజ్రం? బయటకి తియ్‌' అంటూ జమీందారు గద్దించాడు. ఆ దొంగ వణికి పోతూ 'నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి. వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు' అన్నాడు.

ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది. వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి 'నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు' అంటూ దబాయించాడు. ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది. జమీందారు సంగతంతా గ్రహించి, 'ఇద్దరూ దొంగలే. చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి' అన్నాడు కోపంగా.

అది విన్న మల్లన్న మొండిగా, 'ఇది అన్యాయం. 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా?' అని ఎదిరించాడు.

జమీందారు ఒక్క క్షణం ఆలోచించి 'సరే. నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను' అంటూ దొంగవైపు తిరిగి, 'నువ్వు ఎన్ని దొంగిలించావు?' అని అడిగాడు.

'తొంభై తొమ్మిది' అన్నాడు దొంగ.

'అయితే నీకు 99 కొరడా దెబ్బలు' అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, 'నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు?' అని అడిగాడు.

'వందోది' అన్నాడు మల్లన్న. 'అయితే వందో దెబ్బ నీకు' అన్నాడు జమీందారు. అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.

భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే 'ఆ వందోది నాకు వేసేయండి' అన్నాడు. జమీందారు నవ్వి, 'వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా? కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి' అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.
  • -వేముల రామ మోహన రావు@ఈనాడు న్యూస్ పేపర్
  • ============================================

Tuesday, September 23, 2014

Exact medicine-తగిన మందు

  •  

  • Exact medicine-తగిన మందు

అడవికి రాజైన సింహానికి జబ్బుచేసింది. జంతువులన్నీ వచ్చి పరామర్శించి వెళ్లాయి. ఒక్క నక్క మాత్రం రాలేదు. రాజు మెప్పు పొందాలని తోడేలు సపర్యలు చేస్తూ రోజంతా అక్కడే ఉండిపోయింది. నక్కంటే దానికి సుతరామూ పడదు. 'చూశారా ప్రభూ! అందరూ వచ్చారు. మీ యోగక్షేమాలు విచారించి వెళ్లారు. నక్కమాత్రం రానేలేదు. మీరంటే దానికి ఎంత చులకనో!' అంటూ ద్వేషం రగిల్చింది. 'ఎంత కావరం! దాని సంగతి చూస్తాన్లే!' అంటూ కోపంతో గుర్రుమంది సింహం. గుహ బయట నక్కిఉన్న పిల్లి ఈ సంభాషణ విన్నది. వెళ్లి నక్కకు సంగతి చేరవేసింది. 'తోడేలు బాగా నూరిపోసింది. సింహం నీ మీద చాలా కోపంగా ఉంది.' నక్క వెంటనే బయలుదేరి, తోడేలును కలుసుకొంది. 'తోడేలన్నా! రాజుగారికి జబ్బుచేసిందట. వారిని చూడటానికి నేను వెళ్లలేకపోయాను. ఇప్పుడు వెళ్లి విచారించి వద్దాం, నాతో వస్తావా?' అని అడిగింది. తోడేలు సంతోషంగా ఒప్పుకొంది. అవి రెండూ సింహం గుహను సమీపించాయి. నక్కను చూడగానే సింహం ఆగ్రహంతో గర్జించింది. తమాషా చూడాలని తహతహలాడున్నది తోడేలు. 'దొరవారికి పాదాభివందనాలు!' అంటూ మోకరిల్లింది. నక్క. 'తమరికి జబ్బు చేసిందని వినగానే, తగిన మందు పట్టుకొద్దామని వెళ్లాను. ఎక్కడా దొరకలేదు. ఆయుర్వేద వైద్యశిరోమణులు ఏనుగు, బెబ్బులీ, ఒంటె మొదలైన వారిని కలిశాను. అందరూ ఒకే మందు చెప్పారు...' సింహం ముఖం విప్పారింది. 'ఏమిటా మందు?' అడిగింది. 'తమరు వేడివేడిగా తోడేలు నెత్తురు తాగాలని వాళ్లన్నారు. తమవ్యాధి త్వరితంగా నయం కావాలంటే, అదొక్కటే మందంటున్నారు...' అంటూ నక్క తోడేలు వంక ఓరకంట చూసింది. 'ఇంకా చెప్పేదేముంది ప్రభూ! ఇక్కడ తోడేలు సిద్ధంగానే ఉంది కదా!' అంటూ ముక్తాయించింది.  తనకు చావు మూడిందని తోడేలు గజగజావణికిపోయింది.  'అయితే, ఇక ఆలస్యం చెయ్యను' అంటూ సింహం కుప్పించి ముందుకు దూకింది. అంతకంటే ముందే తోడేలు గుహ బయటికి పరుగు తీసింది.

  • పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్ 
  • =======================================

Teacher and Student,గురువు గురువే

  •  

  •  గురువు గురువే
సచ్చిదానంద స్వామి ప్రబోధాలు చేస్తూ వూరూరా తిరుగుతుండేవాడు. ప్రజలిచ్చే దక్షిణను ఖర్చుల కోసం స్వీకరించేవాడు. కొంత కాలానికి ఆయన దగ్గర ఒక మూట నిండా కాసులు సమకూరాయి. దాన్ని ఆయనెప్పుడూ తన రొండిన దోపుకునే ఉండేవాడు.

అది గమనించిన ఒక ఆకతాయి దాన్నెలాగైనా దొంగిలించాలనుకున్నాడు. ఓసారి వినయంగా స్వామి వారిని కలిసి, 'నేనొక అనాధను. నన్ను శిష్యునిగా స్వీకరించారంటే సేవలు చూస్తూ కూడా తిరుగుతాను' అంటూ అభ్యర్థించాడు. స్వామీజీ వాడి మాటలు నమ్మి వాడి భుజాన ఒక జోలెను తగిలించి శిష్యుడిగా చేర్చుకున్నారు. ప్రతి రోజూ గురుశిష్యులు వూరూరా తిరుగుతూ రాత్రి వేళ ధర్మసత్రాల్లో బస చేసేవారు. ఎవరి జోలెను వారు పక్కన పెట్టుకుని పడుకునేవారు. నాలుగు రోజులు గడిచాక స్వామిజీ గాఢ నిద్రలో ఉండగా ఆయన రొండిన కాసుల మూట కోసం శిష్యుడు వెదికాడు. అది కనిపించలేదు. నెమ్మదిగా ఆయన జోలె తీసి చూశాడు. అందులోనూ లేదు. 'గురువు గట్టోడే. కాసుల మూటను ఎక్కడో దాచాడు' అనుకున్నాడు శిష్యుడు.  మర్నాడు స్నానం చేసి వచ్చిన గురువుగారి రొండిన కాసుల మూట యధావిధిగా కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి కూడా వాడు వెతికి చూశాడు కానీ ఎక్కడా మూట కనిపించలేదు. మరో నాలుగు రోజులు తిరిగేసరికి ఆకతాయి శిష్యుడికి విసుగెత్తింది.  గురువుగారి దగ్గరకు వెళ్లి, 'స్వామీ. ఈ సంచార జీవితం మొహం మొత్తింది. ఏదైనా వృత్తి చేసుకుని కాలం గడుపుతాను. సెలవిప్పించండి' అన్నాడు.  'తప్పకుండా పోయిరా నాయనా! ఎక్కడున్నా మంచి బుద్ధితో మెలుగు' అన్నారు సచ్చిదానంద స్వామి.  వెళ్లిన శిష్యుడు వెంటనే తిరిగొచ్చి, 'గురువుగారూ! నాదొక చిన్న సందేహం. పగలంతా మీ మొలను వేలాడే కాసుల మూట రాత్రి వేళ కనిపించదేం? ఎక్కడ దాచేవారో వినాలని కుతూహలంగా ఉంది' అన్నాడు.  సచ్చిదానంద స్వామి నవ్వి, 'నాయనా! నీ వాలకాన్ని మొదటి రోజే గ్రహించాను. రోజూ రాత్రి నీ వెదుకులాట గమనిస్తూనే ఉన్నాను. అందుకనే నిద్రపోయే ముందు కాసుల మూటను నీ జోలెలోనే పెడుతూ వచ్చాను. మర్నాడు నీకన్నా ముందే లేచి తీసుకునేవాణ్ణి. ఇతరులది దోచుకోవాలనుకునే వాడు తన దగ్గరున్నదాన్ని గ్రహించలేడు కదా శిష్యా!' అన్నారు.  శిష్యుడు సిగ్గుతో తలవంచుకుని వెళ్లిపోయాడు.

  • -శ్రీపాద సత్యనారాయణ@ఈనాడు న్యూస్ పేపర్

  • ==============================

Tuesday, February 18, 2014

గుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!




రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujjiగుర్రం గుడ్డు 'ఢాం'... మేకపిల్ల 'మే'!
రామాపురంలో ఉండే గోపాల్‌ చాలా అమాయకుడు. వాడికి నా అనేవాళ్లెవరూ లేరు. గ్రామస్థులంతా రోజుకొకరు చొప్పున గోపాల్‌కి అన్నం పెట్టేవారు. అందరూ చిన్నచిన్న పనులు చెబుతుంటే చేస్తుండేవాడు. కానీ గోపాల్‌ అమాయకుడని, ఇతరుల మాటలు నమ్మి సులువుగా మోసపోతాడని తెలిసి, అతనికి డబ్బుతో ముడిపడిన పనులేవీ చెప్పేవారు కాదు.

వూరికి కొత్తగా శంకరం మాష్టారు వచ్చారు. ఆయనకో చిన్న కొడుకున్నాడు. ఓ రోజు వాడు గుర్రం బొమ్మ కావాలని పేచీపెట్టసాగాడు. అంతలో అటుగా వెళుతున్న గోపాల్‌ను పిలిచారు మాష్టారు. వాడి అమాయకత్వం గురించి తెలియక యాభై రూపాయలిచ్చి గుర్రం బొమ్మ తెమ్మని చెప్పారు. సరేనంటూ చేతిలో డబ్బులు పట్టుకుని హుషారుగా బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒకతను గుమ్మడికాయలు అమ్ముతూ కనిపించాడు. ఆయన దగ్గరికెళ్లి 'ఇక్కడ గుర్రం బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?' అడిగాడు గోపాల్‌. 'ఏమో నాకు తెలీదు' అని చెప్పాడు అతను. తర్వాత గోపాల్‌ గుమ్మడికాయలను ఆశ్చర్యంగా చూస్తూ 'ఏమిటివి ఇంత పెద్దగా ఉన్నాయ్‌?' అడిగాడు. 'వీడొట్టి వెర్రిబాగులవాడిలా ఉన్నాడే. ఇది కూడా తెలియదా, ఈ గుమ్మడికాయను వీడికి అమ్మాల్సిందే' అని మనుసులో అనుకుని 'ఇవి గుర్రం గుడ్లు బాబూ! కొన్ని రోజుల తర్వాత వీటి లోపలి నుంచి పిల్లలొస్తాయి' అని చెప్పాడు.

దానికి గోపాల్‌ చాలా సంతోషించాడు. మాస్టారు గుర్రం బొమ్మను తెమ్మన్నారు, కానీ ఏకంగా గుర్రం పిల్లనే తీసుకెళితే ఆయన నన్నెంతో మెచ్చుకుంటారు' అని మనసులో అనుకుని 'దీని ధరెంత?' అడిగాడు గోపాల్‌. 'ఒక్క గుడ్డు యాభై రూపాయలు' చెప్పాడతను.

గుమ్మడికాయను కొని తలపై పెట్టుకుని బయలుదేరాడు గోపాల్‌.

దారిలో ఒక మేక అడ్డమొచ్చి కిందపడ్డాడు గోపాల్‌. ఆ దెబ్బకి గుమ్మడికాయ రెండు ముక్కలైంది.

అక్కడే ఓ బుజ్జి మేకపిల్ల కూడా ఉంది. 'అరె గుడ్డులో నుంచి అప్పుడే గుర్రం పిల్ల వచ్చేసిందే' అనుకొని దాన్ని తీసుకెళ్లి మాష్టారుకిచ్చాడు. అప్పటికే ఊరివాళ్ల ద్వారా గోపాల్‌ గురించి తెలిసిన మాష్టారు మారు మాట్లాడకుండా వాడిని సాగనంపారు. ఆపై ఎవరూ వాడికి పనులు చెబితే ఒట్టు.

- కోట శ్రీదేవి@eenadu hai bujji

============================================
 Visit my Website at - > Dr.Seshagirirao.com/

Oldman School,తాత బడి

  •  
  •  
ఆరేళ్ల నానికి తాతయ్యను చూడాలని కోరిక. అమ్మని, నాన్నని అడిగితే తాతయ్య పుట్టిన రోజు నాడు వెళదామని నచ్చజెప్పారు. తాతయ్య పుట్టిన రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి నాని హడావుడి ఎక్కువయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. అమ్మ, నాన్న, నాని కారులో బయలుదేరారు.

'తాతయ్యకి డెబ్బయ్యేళ్లు. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నారు. ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్నారు. నీకు మంచి మంచి కథలు చెపుతారు' నానికి చెప్పాడు నాన్న.
ఆశ్రమానికి చేరారు. నానిని చూడగానే తాతయ్య నవ్వుతూ 'బంగారుకొండా! రారా!' అంటూ దగ్గరికి తీసుకుని ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. నానికి ఒళ్లు పులకించింది. తాతయ్యను ముద్దు పెట్టుకున్నాడు.

నానిని తన గదిలోకి తీసుకుపోయాడు తాతయ్య. బోలెడు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు చూపించాడు. పళ్లెంలో ఉన్న రకరకాల పండ్లు చూపించి 'నీకు కావల్సినవి తీసుకో' అన్నాడు.
తరువాత నానిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తోటలోకి తీసుకుపోయి చెట్లు, పిట్టలు చూపించాడు. చెట్ల కథలు, పిట్టల కథలు చెప్పాడు. ఆకాశంలోని మబ్బులు చూపించాడు. మబ్బుల ఆకారాలను చూపించి పాటలు పాడాడు. నానితో పాడించాడు. గాజు తొట్టెలోని రంగురంగుల చేపలను చూపిస్తుంటే, అవి నీటిలో ఈదుతూ ఉంటే చూసి మురిసిపోయాడు నాని.

వాళ్లలా కాసేపు తోటలో దాగుడుమూతలు ఆడారు. దొంగా పోలీసు ఆట ఆడారు. పరుగు పందెంలో నాలుగుసార్లు నాని గెలిచాడు. విజయగర్వంతో గంతులేశాడు నాని.
మధ్యాహ్నం తాతయ్య పుట్టినరోజు కేకుకోసి, నానికి తినిపించాడు. తాతయ్య ఒక బొమ్మల పుస్తకం నానికి బహుమతిగా ఇచ్చాడు. దానిని అపురూపంగా చూసుకున్నాడు నాని. జేబులోంచి కొత్త పదిరూపాయిల నోటు తీసి ఇచ్చి 'ఇది నా గుర్తుగా ఉంచుకో' అన్నాడు తాతయ్య. నాని ఆనందానికి అంతులేదు.

భోజనాలు చేశాక అమ్మ, నాన్నతో కలిసి నాని బయలుదేరాడు. 'తాతయ్యా! నువ్వు నాకు నచ్చావు' అన్నాడు నాని. 'మనవడా! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు' 'నా పేరు నాని, తాతయ్య, నీ పేరు?' అన్నాడు నాని.'నా పేరు తాతయ్యే' అంటూ ముసిముసిగా నవ్వాడు. 'తాతయ్యా! నీ పుట్టిన రోజు బాగా జరిగింది కదా!' 'అవును నానీ! రేపు నీలాంటి మరొక మనవడు వస్తాడు. ఇలా ప్రతిరోజూ నాకు పుట్టినరోజే!' అన్నాడు తాతయ్య. తను నడుపుతున్న 'తాతబడి' అనే వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోతున్న నానిని చూస్తూ, చెమర్చిన కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య.

  • - చొక్కాపు వెంకటరమణ@eenadu hai bujji
  • ============================================