Wednesday, October 13, 2010

ఆభరణం ఎవరిది?తెలుసుకోవడం ఎలా ?, How to know the looser?




సిరిపురం శివాలయంలోని వటవృక్షం కింద ఓ సాధువు, తన శిష్యుడితో బస చేశాడు. రోజూ సాయంత్రం ఆలయానికి వచ్చే భక్తులకు పురాణ పఠనం చేస్తూ ప్రసంగాలు ఇవ్వసాగాడు.

ఓరోజు భక్తులందరూ వెళ్లిపోయిన తర్వాత ఆవరణను శుభ్రం చేస్తున్న శిష్యుడికి చీకట్లో ఏదో తళతళలాడుతూ కనిపించింది. దీపం వెలుగులో చూసేసరికి అదొక బంగారు హారం. శిష్యుడు దాన్ని గురువుకి చూపించాడు.

'ఎవరో భక్తురాలు పోగొట్టుకుని ఉంటుంది. రేపు అందజేద్దాం' అన్నాడు సాధువు.

'అంతమందిలో దీన్ని పోగొట్టుకున్నదెవరో తెలుసుకోవడం ఎలా స్వామీ?' అన్నాడు శిష్యుడు. సాధువు నవ్వి ఊరుకున్నాడు. మర్నాడు ప్రసంగం పూర్తవగానే సాధువు, 'భక్తులారా! నిన్న ఇక్కడెవరో ఓ విలువైన బంగారు ఆభరణాన్ని పోగొట్టుకున్నారు. పరిశీలించి చూడగా ఆ వ్యక్తి తీవ్రమైన గ్రహదోషంతో ఉన్నట్టు నా దివ్యదృష్టికి గోచరించింది. ఆ దోషం పోవాలంటే సుమారు యాభై వేల వరహాలు ఖర్చు చేసి యాగం నిర్వహించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి వస్తే ఆ యాగాన్ని నేనే నిర్వహించగలను' అంటూ జోలెలో దాచిన ఆభరణాన్ని పైకి తీసి చూపించాడు.

భక్తులందరూ దాన్ని చూశారు. ఇంతలో ఓ మహిళ కంగారుగా సాధువు దగ్గరకి వచ్చి, 'స్వామీ! అది నాదే. నగ సంగతలా ఉంచి నా గ్రహదోషం పోవడానికి చేసే ఆ యాగానికి ఏం కావాలో సెలవీయండి' అంది.

సాధువు ఆమెను భక్తులంతా వెళ్లిపోయే వరకూ వేచి ఉండమని చెప్పి ఆభరణాన్ని ఇచ్చేశాడు. ఆపై కాసేపు కళ్లు మూసుకుని ధ్యానించి, 'నువ్వేమీ కంగారు పడకమ్మా! నీ గ్రహస్థితి మారింది. నువ్వే యాగాలూ చేయక్కర్లేదు' అన్నాడు. ఆమె సంబరంగా వెళ్లిపోయింది.

శిష్యుడు ఆశ్చర్యంగా సాధువుని సమీపించి, 'అదేంటి స్వామీ! యాభై వేల వరహాల యాగం చేయక తప్పదని చెప్పిన గ్రహస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోతుంది?' అన్నాడు.

సాధువు నవ్వి, 'బంగారం ఆశను రేకెత్తిస్తుంది నాయనా! ఇదెవరిదో చెప్పండంటే చాలా మంది నాదంటే నాదని ఎగబడేవారు. అందుకే పదివేల వరహాల ఆభరణానికి యాభై వేల యాగాన్ని అడ్డం వేశాను. ఆ నగ నిజంగా ఎవరిదో తెలుసుకోడానికే అలా చెప్పాను' అన్నాడు సాధువు నవ్వుతూ.
- ఆరుపల్లి గోవిందరాజులు


  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

చంద్రుడు--పదహారు కళలు , Moon and sixteen colors





చంద్రుడు దేవతలందరిలోకీ అందగాడు. చల్లని వాడు. పదునాలుగు లోకాల వారికీ ఇష్టుడు.
అశ్విని మొదలైన ఇరవై ఏడుగురు నక్షత్ర కన్యలు దక్షప్రజాపతి కుమార్తెలు. వాళ్లందరూ అందగత్తెలే.
వాళ్లందరినీ దక్షుడు చంద్రుడికిచ్చి వివాహం కావించాడు. చంద్రుడు వాళ్లందరినీ అనురాగంతోనే చూశాడు. కానీ, రోహిణిపైన మాత్రం కొంచెం ఎక్కువ స్నేహం కనబరిచాడు. అదిచూసి మిగతా వారు అసూయ చెంది, లోలోపల కుమల సాగారు. వారందరూ కలిసి పుట్టింటికి వెళ్లి తమ దౌర్భాగ్యాన్ని తండ్రితో చెప్పుకొని కంటనీరు పెట్టుకున్నారు. దక్షుడు వారి పట్ల జాలిపడి, చంద్రుణ్ని తన ఇంటికి పిలిచి తన కుమార్తెలందరిపట్ల సమానమైన ఆదరం కనబరచవలసిందని హితవు చెప్పి పంపాడు. కానీ చంద్రుడు తన పక్షపాతాన్ని మానుకోలేకపోయాడు.
దక్షుడు ఆగ్రహం చెంది, అల్లుడని కూడా ఆలోచించక, చంద్రుడికి క్ష్యయవ్యాధి కలగాలని శపించాడు. ఆ కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించిపోసాగాడు. అతని నుండి వెన్నెల వర్షించటం ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. రాత్రులు గాఢాంధకారంతో నిండి, భయంకరంగా మారాయి. ఆ చీకటిలో రాత్రించరులైన రాక్షసులు విచ్చలవిడిగా సంచరించటం ప్రారంభించారు. లోకాలకు ఉల్లాసం కలిగించే చంద్రుడు అలా నానాటికీ కృశించిపోవటం చూసి ఇంద్రాది దేవతలు, వశిష్ఠాది మహర్షులు దుఃఖించి, చంద్రుణ్ని పిలుచుకొని బ్రహ్మ వద్దకు వెళ్లి, చంద్రుడికి రోగ విముక్తి కలిగించమని ప్రార్థించారు. బ్రహ్మ చంద్రుడితో, 'సుధాకరా! నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్లి మృత్యుంజయుడైన పరమ శివుణ్ని గూర్చి తపస్సు చెయ్యి. దానివల్ల నీ క్షయవ్యాధి పోయి విశ్వశాంతి ఏర్పడగలదు' అన్నాడు.
చంద్రుడు బ్రహ్మ చెప్పిన విధంగా ఆరు మాసాలపాటు తపస్సు చేశాక, ఈశ్వరుడు భవానీ సమేతంగా ప్రత్యక్షమై, 'వత్సా! దక్షశాపం వల్ల కృశించిపోతున్నానని విచారపడకు. నీకు కృష్ణ పక్షంలో ప్రతిరోజూ ఒక్కొక్క కళ క్షీణిస్తుంది. ఈ విధంగా నువ్వు నెలకొకసారి పూర్ణ చంద్రుడివై ప్రకాశిస్తావు' అని వరమిచ్చాడు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల చంద్రుడికి పదహారు కళలు లభించాయి. సకల ప్రాణులకూ సంతోషం కలిగింది.
-పునఃకథనం: కలువకొలను సదానంద



  • ============================================

Visit my Website at - > Dr.Seshagirirao.com/

Monday, October 11, 2010

మన శాంతమే మనకు రక్ష , Our peace is our protection



మానవ జీవితం ఒక విశిస్టమైనది . పంచభూతాలతో నిర్మితమైన ఈ జీవికి పంచావసరాలు ఉంటాయి . గాలి , నీరు , ఆహారము , నిద్ర , మైధునము . వీటిలో ఏ సమయానికి అవి ఉండాలి ... లేనిచో పలు బాధలకు లోనై మనుగడే ప్రశ్నార్ధకము . ఇవి కాకుండా అరిషట్గుణాలకు లోనవుతూ ఉంటాడు మానవుడు . కామ , క్రోధ , మోహ ,లోబ , మధ , మాత్సర్యాలు వలన విలువల్ని కోల్పోతుంటాదు .
శాంతము , క్రోధము ఒకదానికొకటి వ్యతిరేకము . ఒకటి మంచి వేరొకటి చెడు .
  • తన కోపమె తన శత్రువు,
  • తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
  • తన సంతోషమె స్వర్గము,
  • తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ
పురాణ కథలు .:
కైక తండ్రి అయిన కేకయరాజు ఒక రోజు అడవికి వెళ్ళి మగలేడిని బాణము తో కొట్టి వంపగా ... ఆడాలేడి తన తల్లికి పెప్పుకుంది . అప్పుడు ఆ తల్లి లేడి మందర అనే పేరు తో మానవ స్త్రీగా పుట్టి తన అల్లుడిని చంపాడానే క్రోధం తో (పుట్టింది గనుకనే) కైకకు దాసీ గా ఉండి మాయమాటలు చెపి కేకయరాజు యొక్క అల్లుడైన దశరధుడు చనిపోయేటట్లు చేసింది . ఈ కథ వలన తెలిసిందేమిటంటే ... ఎవరికీ విరోధులం కాకూడదు , విరోధులమయ్యే పనులు చేయకూడదూ అనే నీతిని గ్రహించాలి .
అర్జునుడు యుద్ధం లో భీష్మాచార్యుడుని చంపాడు గనుక ... భీష్ముని తల్లి గంగ కు క్రోధం కలిగింది . అర్జునుడు ఆరుమాసాలలో చచ్చుగాక అని శపించినది . జ్వాలాదేవి అర్జునుడు తన కుమారున్ని చంపాడన్న క్రోధం తో అర్జునుని కుమారుడైన బభ్రువాహనుని చేతిలో బాణం గా పుట్టి అర్జునుని తలను త్రుంచేసింది . తరువాత శ్రీకృష్నుడు అర్జునుడిని బ్రతికించాడు .

అంబ భీష్మాచార్యుల పై కోపము తో శిఖండి గా పుట్టి భీష్ముని చావుకి కారణమయినది .

శ్రీ రాముడు వాలిని చంపడం వల్ల వాలి క్రోధం తో మరుజన్మలో రాముడు ... శ్రీకృష్ణుడు గా పుట్టిన తర్వాత '' వాలి కిరాతుడిగ పుట్టి శ్రీకృష్ణుడుని బాణము తో కొట్టి చంపాడు .

పై వన్నీ క్రోధం ఫలితాలే . క్రోధం తో ఇలా మరల మరల పుడుతూ పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కంటే ... క్రోధం కలిగే పనులు చేయకుండా నుంటే ఎంతో మేలు .

  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

ఆహరం తెలిసి తింటే ఏ రోగం రాదు , Eat food by knowing about it



స్త్రీ సుఖి, భోజనసుఖి, నిద్రాసుఖి అను వారి కథ --వ్యవహారం తెలిసి మాట్లాడితే తగాదా లేదు -- ఆహారం తెలిసి తింటే ఏ రోగం రాదు

వంగాదేశమున భూషణుడను ఉండెను. అతనికి ముగ్గురు కొడుకులు కలిగిఉండెను. ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలచి తన పుత్రులను పిలిచి మీరు సముద్రమునకు వెళ్లి యొక కూర్మమును తీసుకొనిరండని చెప్పి పంపెను.

ఆ ముగ్గురు సముద్రమునకు వెళ్లి ఒక కూర్మమును చూచి తమ్ముని పిలిచి దానిని ఎత్తుకొని రమ్మని చెప్పగా వాడు నేను భోజన సుఖిని కనుక ఎత్తజాలనని తెలిపిను. రెండవవానిని యొత్తమనగా వాడు నేను స్త్రీ భోగిని కావున ఎత్తడములేదని చెప్పెను. జ్యేష్ఠుడు నేను నిద్రాసుఖిని కనుక ఎత్తనని పలికెను.

ఈ విధముగా వారు తగవుపడి, విజయనగరమనే పట్టణమునకుపోయి, ఆ పట్టణము నేలుచున్న ప్రతాపుడను రాజువద్ద తమ వాజ్యామును చెప్పుకొనిరి.

అప్పుడు ఆ రాజు వారి సామర్ధ్యమును తెలుసుకొనవలెనని భావించి ఒక స్త్రీని పిలిపించి, వేలగాక వస్త్రభూషణములు ధరింపజేసి స్త్రీ భోగి వద్దకు పంపగానే వాడు ఆ స్త్రీని చూచి, ముక్కు మూసుకొని నీవద్ద దుర్వాసన కలదు వెంటనే వెళ్ళిపొమ్మని పంపివేసెను. ఆ సంగతి రాజు తెలుసుకొని, దాని తల్లిని పిలిపించి ఆ స్త్రీ పూర్వచరిత్ర తెలుపుమనియడుగాగా "ఇది నా చెల్లెలి కూతురు. ఇది పుట్టిన ఐయిదు దినములకే నా చెల్లెలు మరణించినది. అప్పుడు నుంచి దేనికి మేకపాలు పట్టించి పెంచితిని. కావున దీని శరీరము దుర్వాసన కలిగిఉన్నది" అని చెప్పెను.

తరువాత రాజు మదురమైన పదార్ధము వండించి భోజనసుఖిని పిలిపించి భోజనం చేయమనగా, వాడు ఆ యన్నమును చూచి పీనుగుకంపు కొట్టుచున్నదని పలికి వదిలిపెట్టెను. రాజు ఆ సంగతి విచారించగా, ఆ యన్నము శ్మశానము దగ్గరనున్న భూమిలో పండించిన వడ్లబియ్యముతో వండిచినందున అట్టి వాసన కలిగినదని గ్రహించెను.

పిమ్మట ఆరాజు ఒక మృదువైన పరుపును తయారుచేయించి, నిద్ర సుఖ్ని పిలిచి దానిపై పరుండుమని చెప్పగా, వాడా పరుపుపై పవళించి వెంటనే పైకి లేచిపోయెను. అలా ఎందుకు చేసితివి అని రాజు అడుగగా ఆ పరుపులో ఒక వెంట్రుక ఉన్నది అది ఒత్తుకొనుటచే లేచితిని అని చెప్పెను. రాజు ఆ పరుపును విప్పించి చూడగా దానియందు రోమముండెను.

రాజు వారు ముగ్గురు చెప్పిన విషయములు విని, వారికిగల సామర్ధ్యమునకు సంతోషించి తగు బహుమతులు ఇచ్చి గౌరవించెను. ఓ విక్రమాదిత్య మహారాజా! ఆ ముగ్గురిలో ఎవరు అధిక సుకుమారులు?" అని ప్రశ్నించగా, విక్రమాదిత్యుడు "భోజన సుఖి, స్త్రీ సుఖి బుద్దిచేత గ్రహించి చెప్పిరి. నిద్రాసుఖి పరుపులోనున్న వెంట్రుక వలన కలిగిన దద్దు వాని శరీరమున కానవచ్చెను. కావున వాడే సుకుమారి" యని చెప్పెను. అది విని భేతాలుడు సంతోషించి, మరల పారిపోయి వృక్షంనెక్కి ఎప్పటి వలె యుండెను.



భేతాలుని కథలు
  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

Saturday, October 9, 2010

లంక చేరని ఆత్మలింగం , Shiv Linga not reached Lanka



పురాణ కథ - లంక చేరని ఆత్మలింగం : లంకాధీశ్వరుడైన రావణుడు శివభక్తులలో అగ్రగణ్యుడు. అతడు హిమాలయాలకు వెళ్లి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. రావణుడు 'పరమేశ్వరా! నువ్వు నా లంకానగరానికి వచ్చి, అక్కడ నిత్య నివాసం చెయ్యి' అని కోరాడు.
శివుడు తన ప్రతీక అయిన ఆత్మలింగాన్ని అతనికి ప్రసాదించి, 'ఈనా ఆత్మలింగాన్ని ఎక్కడ ప్రతిష్టించితే, నేను అక్కడ ఉంటాను. దీనిని తీసుకుపో! లంకానగరం చేరే వరకు పొరబాటుగానైనా దీనిని కింద పెట్టకు. ఇది కిందపడితే, మళ్లీ లేవనెత్తటం అసాధ్యం' అని హెచ్చరించాడు.
ఈ విషయం తెలిసి దేవతలు హడలి పోయారు. శివుడికి లంకలో నిత్యనివాసం ఏర్పడితే, రావణాసురుణ్ణి జయించే వాళ్లు ఎవరూ ఉండరు. లంకమీదికి దండెత్తే సైన్యాలను శివుడే చంపుతాడు. కనుక ఆత్మలింగం లంకకు చేరటం దేవతలకు ఇష్టంలేక పోయింది. ఈ ఆపద తొలగటానికి వాళ్లు గణపతిని పూజించారు.
గణపతి తన మాయతో రావణుని మార్గంలో మనుష్యులెవరూ లేకుండా చేసి తాను గోప బాలకుడి వేషంలో వెళ్లి సముద్రతీరంలో ఒక చోట పశువులను మేపుకోసాగాడు. ఆత్మలింగాన్ని చేత బట్టుకొని రావణుడు అక్కడికి రాగానే, సాయంకాలమైంది. రావణుడు బ్రహ్మజ్ఞాని. త్రిసంధ్యలలోను సంధ్యవార్చుకొనే నియమం కలవాడు. ఆత్మలింగాన్ని కిందపెట్టి వెళ్లి సంధ్య వార్చుకోవటం కుదరదు కనుక, సహాయం కోసం చుట్టూ చూడగా, గోప బాలకుడు అతనికి కానవచ్చాడు. రావణుడు అతన్ని పిలిచి కొద్దిసేపు ఆత్మలింగాన్ని పట్టుకోమని, తాను సంధ్యవార్చి తిరిగి వచ్చేవరకు కిందపెట్టవద్దనీ చెప్పాడు.
గణపతి దానిని తీసుకొని 'ఇది చాలా బరువుగా ఉంది. దీనిని మోసుకొని ఉండటం నాకు కష్టమైపోతే మూడుసార్లు నిన్ను పిలుస్తాను. ఆలోగా వచ్చి దీనిని అందుకో. నువ్వు రాకపోయావో తప్పు నాది మాత్రం కాదు' అన్నాడు. రావణుడు అందుకు సమ్మతించి, సముద్ర స్నానానికి వెళ్లాడు. అతడు సంధ్య వార్చుకోక ముందే గణపతి 'రావణా! త్వరగారా!' అంటూ మూడుసార్లు పిలిచాడు.
రావణుడు, 'ఇదిగో వచ్చేస్తున్నాను' అంటుండగానే గణపతి 'ఇక నావల్లకాదు, అని చెప్పి, లింగాన్ని భూమిపైన పెట్టి మాయమయ్యాడు. రావణుడు పరుగు పరుగున వచ్చి, భూమిలో కూరుకుపోయిన లింగాన్ని లేవనెత్తటానికి విశ్వప్రయత్నం చేశాడు. అతని బలానికి భూమి కంపించింది కానీ ఫలితం మాత్రం లేకపోయింది. తన ప్రయత్నమంతా నిష్ఫలమైనందుకు రావణుడు దుఃఖించి, ఆకాశవాణి ప్రబోధం మేరకు, అక్కడొక తటాకాన్ని నిర్మించి, సకల తీర్థాలలోని పవిత్ర జలాలను అందులోకి రప్పించి, ఆ జలాలతో లింగాన్ని అభిషేకించి, పూజించి, లంకకు మరలివెళ్లాడు.
అతని ప్రయత్నం భగ్నం అయినందుకు దేవతలంతా సంతోషించారు.

-పునఃకథనం: కలువకొలను సదానంద-Eenandu news paper

ఆత్మలింగ క్షేత్రం గోకర్ణం

మనదేశంలోని అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రాలలో గోకర్ణం ఒకటి. పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగతా రెండు వారణాశి, రామేశ్వరం. గోకర్ణక్షేత్రానికి పడమట అరేబియా సముద్రం, తూర్పున సిద్ధేశ్వరక్షేత్రం, ఉత్తరాన గంగావళినది, దక్షిణాన అగనాశిని నది ఉన్నాయి. ఇలా ప్రకృతి రమణీయతతో అలరారుతుండే ఈ క్షేత్రంలో శివుని ఆత్మలింగం ప్రతిష్టితమైంది.

పురాణ కథ

ఈ పుణ్యక్షేత్ర ప్రసక్తిని రామాయణ, మహాభారతాలలో చూడగలం. ఇక స్కాందపురాణంలో ఒక అధ్యాయమే ఈ క్షేత్ర ప్రాముఖ్యాన్ని వివరిస్తోంది. పూర్వం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, అతని తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన శివుడు వరాన్ని కోరుకొమ్మన్నాడు. అప్పుడు రావణాసురుడు తనకు ఆత్మలింగం కావాలని కోరాడు. అందుకు ఓ నిబంధన విధించిన శివుడు, రావణాసురునికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం, రావణాసురుడు లంకకు వెళ్ళేంతవరకు ఆత్మలింగాన్ని నేలపై దించుకూడదు. ఆత్మలింగాన్ని అందుకున్న రావణాసురుడు లంకవైపు పరుగులు తీయసాగాడు. ఆత్మలింగం రావణాసురుని దగ్గరే ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయని కలత చెందిన దేవతలు, తమను కాపాడవలసిందంటూ విష్ణుమూర్తి, బ్రహ్మ, విష్నేశ్వర తదితర దేవుళ్లను వేడుకోగా, గణపతి చిన్నపిల్లవాని వేషంలో రావణాసురునికి మార్గమధ్యంలో ఎదురుపడతాడు. సరిగ్గా అప్పుడే విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెడతాడు. సాయంత్రం అవుతుందనుకున్న రావణాసురుడు సంధ్యావందనాన్ని నిర్వర్తించాలనుకుంటాడు. అయితే అతని రెండు చేతుల్లో శివుని ఆత్మలింగం ఉంది.

అప్పుడు అటుగా బాలరూపంలో వచ్చిన వినాయకుని చూసిన రావణాసురుడు, కాసేపు ఆత్మలీంగాన్ని పట్టుకొమ్మని, తాను సంధ్యావందనం చేసి వస్తానని అభ్యర్ధిస్తాడు. అందుకు ఒప్పుకున్న బాలవినాయకుడు, తాను మూడుసార్లు పిలుస్తానని, అప్పటికీ రావణాసురుడు రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెబుతాడు. వేరే దారిలేని రావణాసురుడు వినాయకుని నిబంధనకు ఒప్పుకుని సంధ్యావందనం చేసుకోడానికి వెళతాడు. అయితే రావణాసురునికి ఏమాత్రం అవకాశాన్ని ఇవ్వని వినాయకుడు, గబగబా మూడుసార్లు రావణాసురుని పిలిచి, ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. రావణాసురుడు ఎంతగా పరుగులు పెట్టి వచ్చినప్పటికీ జరగాల్సింది జరిగిపోతుంది. ఆ సంఘటనకు కోపగించుకున్న రావణాసురుడు బాలవినాయకుని తలపై ఒక మొట్టికాయ వేస్తాడు. ఫలితంగా గణపతి తలపై నొక్కు ఏర్పడుతుంది. ఆ నొక్కును ఇప్పటికీ, ఇక్కడున్న మహాగణపతి ఆలయంలోని గణపతి విగ్రహానికి చూడవచ్చు. ఆ తరువాత రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోతాడు. ఆత్మలింగాన్ని తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు. అది విసురుగా వెళ్ళి దూరంగా పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టె మూతపడిన చోట గుణేశ్వర లింగం ఉద్భవిస్తుంది. లింగంపై కప్పబడిన వస్త్రం పడిన చోట మురుడేశ్వర లింగం వెలుస్తుంది. పెట్టెను కట్టిన (తాళ్ళు) పడినచోట ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది. ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబలేశ్వరలింగంగా గోకర్ణంలో వెలుస్తుంది. ఆత్మలింగంతో ముడిపడిన ఐదుక్షేత్రాలను శైవ పంచక్షేత్రాలని పిలుచుకుంటుంటారు.

ఇంకొక కథనం ప్రకారం, పాతాళలోకంలో తపస్సు చేసి, భూలోకానికి వస్తున్నప్పుడు, భూమాత గోరూపాన్ని ధరించిందట. ఆ గోవుచెవి నుండి పరమేశ్వరుడు బయటకు రావడంతో ఈ క్షేత్రనికి గో (ఆవు) కర్ణం (చెవి) = గోకర్ణం అనే పేరు ఏర్పడిందట.

పురాతన ప్రాశస్త్యం

దక్షిణకాశి, భూకైలాసం అని భక్తులచే కొనియాడబడుతున్న ఈ క్షేత్రచరిత్ర ఎంతో పురాతనమైనది. కాళిదాసు, తన 'రఘువంశం' కావ్యంలో ఈ క్షేత్ర ప్రస్తావన చేసాడు. క్రీ.శ. ఏడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హర్షవర్ధనుడు 'నాగానంద' కావ్యంలో ఈ క్షేత్రం గురించి వివరించాడు. కదంబ చక్రవర్తి మయూరశర్మ ఈ ఆలయంలో నిత్యపూజాదికాలైన ఏర్పాట్లు చేసాడనీ, చెన్నమ్మాజీ, ఆమె కుమారుడు సోమశేఖర నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హళసునాడు - కుందపురానికి చెందిన విశ్వేశ్వరాయుడు చంద్రశాల, నందిమంటపాలను నిర్మించాడని శసనాల ద్వారా తెలుస్తోంది. అనంతరం గోకర్ణం క్షేత్రాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేసారు. క్రీ.శ. 1665వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ ఈ క్షేత్రాన్ని దర్శించుకుని పూజలు చేసాడట.

కోటితీర్థం

గోకర్ణంలో ప్రధానాలయం శ్రీ మహాబలేశ్వరాలయం. ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే ముందు భక్తులు కోటితీర్థంలో స్నానం చేస్తారు. కోటితీర్థంలో స్నానం చేస్తే సమస్తరోగాలు నయమవుతాయని ప్రతీతి. కోటితీర్థంలో స్నానం చేసిన తరువాత భక్తులంతా ప్రక్కనున్న సముద్రంలో స్నానం చేస్తారు. ఆలయానికి ప్రక్కనున్న అరేబియా సముద్రంలో స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మిక. కోటితీర్థానికి దక్షిణం వైపు అగస్త్యులవారిచే ప్రతిష్ఠింప బడిన వరటేశ్వరలింగం ఉంది. ఈ ఆలయము భక్తుల సౌకర్యార్థం ఇరవైనాలుగు గంటలూ తెరువబడే ఉంటుంది.

మహాబలేశ్వరాలయం

పురాతనమైన ఈ ఆలయం పెద్ద గాలిగోపురంతో భక్తులను ఆహ్వానిస్తుంటుంది. ఈ లింగం కిందివైపు కాస్త వెడల్పుగా, పైన సన్నగా కనబడుతుంటుంది. రావణాసురుడు ఈ శివలింగాన్ని పైకి లాగడనికి ప్రయత్నం చేయడం వల్ల లింగంపై భాగాన సన్నగా ఉందంటారు. పైకి ఉండే ఒక రంధ్రంలో వ్రేలును ఉంచినపుడు కిందనున్న లింగం వ్రేలుకి తగులుతుంది. భక్తులు శివలింగం చుట్టూ కూర్చుని పూజలు నిర్వహిస్తారు. ఈ శివపూజను నిర్వహించడానికి ఒక భక్తునికి ఒక రూపాయి చొప్పున రుసుమును వసూలు చేస్తూంటారు. అయితే, మహామంగళహారతుల సమయంలో గర్భగృహహంలోకి భక్తులను అనుమతించరు. ఇక్కడ పన్నెండు సంవత్సరాల కొకసారి ఒక విశేషమైన కార్యక్రమము జరుగుతుంది. అప్పుడు శివలీంగాన్ని బయటకు తీసి, నిజస్వరూప లింగానికి పూజలు చేస్తారు. ఈ పుష్కర ఉత్సవాలకు దేశవిదేశాల నుండి లక్షలసంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం జరగాల్సి ఉంది. ఇక, ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ఏడురోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఈ సందర్భంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు మంగళహారతి పూజలు జరుగుతుంటాయి. ఆలయంలోకి ప్రవేశించే పురుషులు చొక్కాలను విడిచి, భుజాలపై కండువాలతో స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.

తామ్రగౌరీ ఆలయం

మహాబలేశ్వర ఆలయప్రాంగణంలో ఉత్తరం వైపున ఈ ఆలయం ఉంది. ఈమె మహాబలేశ్వరుని పత్ని. ఈమె బ్రహ్మదేవుని కుడిచేయినుండి ఉద్భవించిందని చెబుతారు. ఈ దేవి తపస్సు చేసి రుద్రున్ని వివాహం చేసుకుంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు, సాయంత్రం ఐదుగంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉంటుంది.

మహాగణపతి ఆలయం

రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్తున్నప్పుడు, అతడిని అడ్డుకున్న గణపతి చారుర్యాన్ని మెచ్చుకున్న పరమశివుడు మహాబలేశ్వరక్షేత్రంలో ముందుగా వినాయకుని దర్శించుకున్న తరువాతే భక్తులు తన సన్నిధికి వస్తారని వరమిచ్చాడు. రావణుడు వేసిన మొట్టికాయకు గుర్తుగా ఈ స్వామి తలపై చిన్న పల్లం కనబడుతుంటుంది. ఈ ఆలయం మహాబలేశ్వర ఆలయానికి తూర్పుదిక్కున ఉంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహనం ఒకటిన్నరవరకు, సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదింపావు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.

ఇంకా ఈ క్షేత్ర ప్రాంగణంలో భద్రకాళి, కాలభైరవ శ్రీకృష్ణ, నరసింహస్వామి దేవాలయాలున్నాయి. నేత్రాసురుడు అనే రాక్షసుని సంహరించేందుకై, త్రిమూర్తుల శక్తితో భద్రకాళి ఆవిర్భవించారట. అమృతమధనం జరుగుతున్నప్పుడు దేవతలు ఇక్కడకు వచ్చి ఆత్మలింగానికి పూజలు చేయడం వల్ల వారికి అమృతం లభించిందని ప్రతీతి.

గోకర్ణంలో బస చేసేందుకు హోటళ్ళ సౌకర్యం బాగానే ఉంది. గోకర్ణం బెంగుళూరు నుంచి సుమారు 450 కి.మీ దూరంలో ఉంది. హబ్లి, ఉడుపి, మంగళూరు, బెల్గాంల నుండి ఇక్కడికి బస్సు సౌక్యం ఉంది. కొంకణీరైలు మార్గంలో గోకర్ణరోడ్డు స్టేషన్‌కి ఆలయానికి మధ్య ఐదు కిలోమీటర్ల దూరం ఉంది.

గోకర్ణానికి చుట్టుప్రక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు

ధారేశ్వర ఆలయం

ఈ ఆలయం గోకర్ణానికి దక్షిణదిక్కున సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆత్మలింగానికి సంబంధించిన లింగం. ఈ ఆలయం చాళుక్య, హోయిసల శిల్పశైలిలో కనబడుతుంటుంది. దీనిని పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిదిగంటల వరకు తెరచి ఉంటుంది.

గుణవంతేశ్వర ఆలయం

ఈ ఆలయం కూడ గోకర్ణ ఆత్మలింగానికి సంబంధించిన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇది గోకర్ణం నూంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరచిఉంటుంది.

మురుడేశ్వర ఆలయం

పంచలింగాల క్షేత్రాలలో ఇది కూడ ఒకటి. ఈ భారీ ఆలయం భక్తులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఇది గోకర్ణక్షేత్రానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ఆరు గంటల నుండి తెరచి ఉంటుంది.

మూలము : భక్తిసుద (bhaktisudha.com)





  • ============================================
Visit my Website at - > Dr.Seshagirirao.com/

Yamudu son Yamaha , యముడి కొడుకు యమహా.



కథ -- యముడి కొడుకు యమహా!
ఓసారి యముడు భూలోకానికి వచ్చినప్పుడు ఓ అందాల సుందరిని చూశాడు. ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అతడికి అనిపించింది. వెంటనే మనిషి రూపం ధరించి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందమైనదే కానీ ఒట్టి గయ్యాళి. పెళ్లయిన మర్నాటి నుంచే చీటికీ మాటికీ అతడిని సాధించేది. ఆమె మీద ఉండే ప్రేమతో యముడు అదంతా భరించేవాడు. కొన్నాళ్లకు వారికో ఓ కొడుకు పుట్టాడు.

కొడుకు యువకుడయ్యేసరికి యముడికి భార్యంటే మొహం మొత్తింది. ఆమె గొంతు వింటేనే కంపరం పుట్టుకొచ్చేది. ఇక ఎంత మాత్రం ఆమెను భరించలేనని నిర్ణయించుకున్న యముడు తన కొడుకును దగ్గరకు పిలిచి జరిగిందంతా చెప్పి, 'ఇక నాకు ఈ జీవితంపై విరక్తి కలిగింది. నా కొడుకుగా నీకొక గొప్ప రహస్యం చెబుతా. నువ్వు వైద్య వృత్తిని ప్రారంభించు. నువ్వు ఏ రోగిని చూసినా అతడికి నయం అయ్యేటట్టు వరమిస్తున్నా. అయితే ఏ రోగి తల దగ్గరైనా నేను కనిపిస్తే మాత్రం వైద్యం చేయకు. ఎందుకంటే వాళ్ల చావు తప్పదన్నమాట' అంటూ అదృశ్యమైపోయాడు. తండ్రి చెప్పినట్టే ఆ యువకుడు వైద్యవృత్తిని చేపట్టి గొప్ప హస్తవాశి కలవాడుగా పేరుపొందాడు. ఓసారి ఆ దేశపు రాకుమారికి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడింది. పెద్ద పెద్ద వైద్యులు కూడా నయం చేయలేకపోయారు. రాజు వెంటనే రాజ్యమంతటా చాటింపు వేయించి రాకుమారి జబ్బు తగ్గించినవారికి ఆమెనిచ్చి పెళ్లి చేయడంతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తానంటూ ప్రకటించాడు.

ఆ ప్రకటన విన్న యువకుడు ఉత్సాహంగా రాజధాని బయల్దేరి రాకుమారిని చూశాడు. ఆమెను పరీక్షిస్తూ చుట్టూ చూసేసరికి తలదగ్గర తండ్రి కనిపించాడు. ఆమె చనిపోక తప్పదని అతడికి అర్థం అయింది. రాకుమారిని రక్షిస్తే జీవితాంతం సుఖంగా బతకవచ్చనుకున్న యువకుడికి ఏం చేయాలో తోచలేదు. కాసేపు ఆలోచించిన అతడికి ఓ ఉపాయం తోచింది. వెంటనే గది గుమ్మం వరకూ పరిగెత్తి బయటకి చూస్తూ, 'అమ్మా! త్వరగా రా. నాన్నగారు ఇక్కడే ఉన్నారు' అంటూ అరిచాడు.

కొడుకు కేక వినగానే యమభటుడికి చెమటలు పట్టాయి. గయ్యాళి భార్యను చూడవలసి వస్తుందనే భయంతో చటుక్కున అదృశ్యమైపోయాడు. దాంతో ఆ యువకుడి వైద్యం ఫలించింది. రాకుమారిని పెళ్లాడి, రాజవ్వాలన్న అతడి ఆశ కూడా నెరవేరింది!

Courtesy Eenadu news paper
-మేకల మదన్‌ మోహన్‌ రావు
  • =========================================
visit my Web-blog -> Dr.Seshagirirao.com/