Tuesday, September 23, 2014

Exact medicine-తగిన మందు

  •  

  • Exact medicine-తగిన మందు

అడవికి రాజైన సింహానికి జబ్బుచేసింది. జంతువులన్నీ వచ్చి పరామర్శించి వెళ్లాయి. ఒక్క నక్క మాత్రం రాలేదు. రాజు మెప్పు పొందాలని తోడేలు సపర్యలు చేస్తూ రోజంతా అక్కడే ఉండిపోయింది. నక్కంటే దానికి సుతరామూ పడదు. 'చూశారా ప్రభూ! అందరూ వచ్చారు. మీ యోగక్షేమాలు విచారించి వెళ్లారు. నక్కమాత్రం రానేలేదు. మీరంటే దానికి ఎంత చులకనో!' అంటూ ద్వేషం రగిల్చింది. 'ఎంత కావరం! దాని సంగతి చూస్తాన్లే!' అంటూ కోపంతో గుర్రుమంది సింహం. గుహ బయట నక్కిఉన్న పిల్లి ఈ సంభాషణ విన్నది. వెళ్లి నక్కకు సంగతి చేరవేసింది. 'తోడేలు బాగా నూరిపోసింది. సింహం నీ మీద చాలా కోపంగా ఉంది.' నక్క వెంటనే బయలుదేరి, తోడేలును కలుసుకొంది. 'తోడేలన్నా! రాజుగారికి జబ్బుచేసిందట. వారిని చూడటానికి నేను వెళ్లలేకపోయాను. ఇప్పుడు వెళ్లి విచారించి వద్దాం, నాతో వస్తావా?' అని అడిగింది. తోడేలు సంతోషంగా ఒప్పుకొంది. అవి రెండూ సింహం గుహను సమీపించాయి. నక్కను చూడగానే సింహం ఆగ్రహంతో గర్జించింది. తమాషా చూడాలని తహతహలాడున్నది తోడేలు. 'దొరవారికి పాదాభివందనాలు!' అంటూ మోకరిల్లింది. నక్క. 'తమరికి జబ్బు చేసిందని వినగానే, తగిన మందు పట్టుకొద్దామని వెళ్లాను. ఎక్కడా దొరకలేదు. ఆయుర్వేద వైద్యశిరోమణులు ఏనుగు, బెబ్బులీ, ఒంటె మొదలైన వారిని కలిశాను. అందరూ ఒకే మందు చెప్పారు...' సింహం ముఖం విప్పారింది. 'ఏమిటా మందు?' అడిగింది. 'తమరు వేడివేడిగా తోడేలు నెత్తురు తాగాలని వాళ్లన్నారు. తమవ్యాధి త్వరితంగా నయం కావాలంటే, అదొక్కటే మందంటున్నారు...' అంటూ నక్క తోడేలు వంక ఓరకంట చూసింది. 'ఇంకా చెప్పేదేముంది ప్రభూ! ఇక్కడ తోడేలు సిద్ధంగానే ఉంది కదా!' అంటూ ముక్తాయించింది.  తనకు చావు మూడిందని తోడేలు గజగజావణికిపోయింది.  'అయితే, ఇక ఆలస్యం చెయ్యను' అంటూ సింహం కుప్పించి ముందుకు దూకింది. అంతకంటే ముందే తోడేలు గుహ బయటికి పరుగు తీసింది.

  • పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్ 
  • =======================================

No comments:

Post a Comment