Wednesday, July 29, 2015

Godavari epic story-గోదావరి పురాణ కథ

 •   •  
గౌతమ మహర్షి దండకారణ్యంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాడు. దగ్గరలోనే ఒక పుష్కరిణి తవ్వించుకొన్నాడు. అందులో ఎప్పుడూ సమృద్ధిగా నీళ్లు ఉండేవి. పాడి పంటలతో ఆ ముని వాటిక సస్యశ్యామలంగా ఉండేది.
ఇలా ఉండగా ఆ ప్రాంతంలో తీవ్రమైన అనావృష్టి ఏర్పడింది. భూమి బీటలు వారింది. పంటలు పండలేదు. వాగులూ వంకలూ ఎండి పోయాయి. గుక్కెడు మంచి నీళ్లు దొరకక, జనం అలమటించసాగారు. పన్నెండేళ్ల పాటు తీవ్రమైన కరువు కొనసాగింది.

వర్షాలు కురిపించమని గౌతముడు వరుణదేవుని ప్రార్థించాడు. వరుణుడు కరుణించలేదు. గౌతముడు ఊరుకోలేదు. సూక్ష్మ శరీరంతో వరుణ లోకానికి బయలు దేరాడు. ఇది తెలిసి వరుణుడు తన నగరమైన శ్రద్ధావతి చుట్టూ మహా శక్తిమంతమైన మేఘ సమూహాలను కాపలా ఉంచాడు. గౌతముడు వాటిని చిందరవందర చేస్తూ శ్రద్ధావతిని చేరాడు.

వరుణుడు 'నా అనుమతి లేకుండా నా నగరంలోకి ఎందుకు ప్రవేశించా'వని గద్దించాడు. కరువు పీడను గురించి చెప్పి, వానలు కురిపించమని ప్రార్థించాడు గౌతముడు. వీలు పడదని చెప్పి, వరుణ దేవుడు గౌతముని మీదికి తన పాశాయుధాలను విసిరాడు. ఆ మెరుపు తీగలతోనే గౌతముడు వరుణుడిని బంధించి తన ఆశ్రమానికి లాక్కువెళ్లాడు. అతడిని నీరుగా మార్చి పుష్కరిణిలోకి ప్రవహింపజేశాడు. 'నువ్వు అమిత పుణ్యాత్ముడివి గనుక, నీకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నిన్ను పాపం అంటిన మరుక్షణం నేనిక్కడ ఉండను' అని చెప్పి వరుణుడు అక్కడే ఉండి పోయాడు. లోకమంతా కరువు కాటకాలు తాండవిస్తున్నా గౌతముని ఆశ్రమ ప్రాంతం మాత్రం సుభిక్షంగా ఉంటున్నది.

పన్నెండేళ్ల కరువు పూర్తయింది. లోకమంతా వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణుడిపై ఉంది. పుష్కరిణిలో బంధితుడైన వరుణుడికి కర్తవ్యం తోచలేదు. అతడు బ్రహ్మను తలచుకొన్నాడు.

ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు రాగా, గౌతముడు గడ్డి పరకతో దానిని అదిలించాడు. ఆ మాత్రానికే అది కింద పడి ప్రాణం కోల్పోయింది. గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకొంది. వరుణుడికి స్వేచ్ఛ కలిగింది. పుష్కరిణి ఎండిపోయింది.

గౌతముడు బ్రహ్మ గిరికి వెళ్లి శివుణ్ని గురించి తపస్సుచేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శివ జటాజూటం నుంచి గంగను విడువమన్నాడు గౌతముడు. నేలమీదికి దూకిన గంగను గోవు కళేబరం వద్దకు తీసుకుపోయాడు గౌతముడు. గంగ తనను తాకగానే గోవు ప్రాణంతో లేచి నిలబడింది. గౌతమ మహర్షిని అంటిన పాపం తొలగిపోయింది. సప్తర్షులు గంగను వెంటబెట్టుకుపోయి, ఆమెను సముద్రుడికి అప్పగించారు.

గంగా ప్రవాహం దక్షిణా పథాన్ని సస్యశ్యామలంగా మార్చింది. గౌతముడి వల్ల ఏర్పడింది కనుక గౌతమి అని గోవును బతికించింది కనుక గోదావరి అని ఆ నదికి పేర్లు వచ్చాయి.

-పునఃకథనం: కలువకొలను సదానంద
   

Thursday, September 25, 2014

The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం

 •  

 • The world hungup of money-డబ్బుకు లోకం దాసోహం

సిరిపురంలో రాజా, రంగాలవి పక్కపక్క ఇళ్లు. పక్కపక్క పొలాలూనూ. వాళ్లిద్దరూ చిన్న నాటి నుంచి ప్రాణస్నేహితులు.  ఒక రోజు పని ఉండి పట్నం వెళ్లదలిచారు. ఉదయం బయల్దేరి అడ్డదోవన అడవి దారి గుండా వెళితే అదే రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు. అసలే పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చాలా సమయం ఆదా అవుతుందని భావించి అడవి దారి పట్టారు.  మిత్రులిద్దరూ పాటలు పాడుకుంటూ కబుర్లు, నవ్వులతో దారంతా హోరెత్తిస్తూ సరదా సరదాగా ప్రయాణం సాగిస్తున్నారు. అది ప్రమాదకరమైన జంతువులు లేని చిన్న అడవే. అయినా చేతి కర్రలతో అప్రమత్తంగానే ఉన్నారు.  ఇంతలో మార్గ మధ్యంలో తళతళ మెరుస్తూ ఒక వజ్రపుటుంగరం రాజా కళ్ల బడింది. ఆశ్చర్యానందాలతో దానిని తీసుకున్నాడు రాజా.  మిత్రులిద్దరూ తిరిగి నడవసాగారు. కానీ ఈసారి వారి మధ్య మౌనం రాజ్యమేల సాగింది.   ఆ వజ్రం విలువ ఎన్ని లక్షలు ఉంటుందో దానితో తాను ఏ స్థిరాస్తులు సమకూర్చుకోగలడో ఆలోచించసాగాడు రాజా.  ఆకస్మికంగా మిత్రుడికి పట్టిన అదృష్టానికి మనసులోనే ఈర్ష్య చెందసాగాడు రంగా. ఆ ఉంగరం తనకు దొరికితే ఎంత బాగుండేదో అని వూహించుకోసాగాడు.  మొత్తానికి కబుర్లకి కళ్లెం పడి పరధ్యానంలో మునిగిపోయారు ఎవరికి వారే.

అకస్మాత్తుగా గుబురుగా ఉన్న పొదల్లోంచి చరచర పాకుతూ వారికి అడ్డు వచ్చిందో నల్లతాచు. ఒక్క క్షణం ఆలస్యమైనా అది రంగా పాదంపై కాటు వేసేదే. మెరుపులా తప్పుకున్నాడు రంగా. పాము బాటను దాటి పొదల్లోకి పాకుతూ పోయింది.  వూపిరి పీల్చుకున్నారు మిత్రులిద్దరూ. 'నేనంటే ఆ ఉంగరం అమ్మితే ఎంతొస్తుందో, ఏం కొనొచ్చో ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు పరాకుగా ఉన్నావ్‌?' అన్నాడు రాజా చిరాకు పడుతూ.  'నీ దగ్గర దాపరికమెందుకు? నాకే ఆ ఉంగరం దొరికితే ఎంత బాగుండేదా అనుకుంటున్నా' అన్నాడు రంగా నిజాయితీగా.  ఇంతలో ఓ వ్యక్తి ఆదుర్దాగా దారంతా వెతుకుతూ వారికి ఎదురు వచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్నాడని తెలుసుకుని ఆనవాళ్లు అడిగి అతడి ఉంగరం అతడికి ఇచ్చేశాడు రాజా.  ఎంతో సంతోషంగా వారికి తన చేతిలోని మిఠాయిల డబ్బా ఇచ్చాడా వ్యక్తి. వారితో కలిసి నడవసాగాడు. రాజా, రంగాల మధ్య పాటలు, కబుర్లు, సందడి తిరిగి చోటు చేసుకున్నాయ్‌.  అయాచితంగా వచ్చిన డబ్బు కోసం ఆశ, ఆలోచనలు వారి కబుర్లు, ఆనందాల్ని ఎలా అణిచేసిందో, 'డబ్బుకు లోకం దాసోహం' అని అంతా ఎందుకంటారో అప్పుడర్థమైంది వారికి.

 • -గుడిపూడి రాధికారాణి@ఈనాడు న్యూస్ పేపర్ 
 • ============================================ 

King .cook.Minister- రాజు.వంటవాడు.మంత్రి

 •  


 • wonderful dish-అపురూప వంటకం
  విశాలనగర రాజు రాజీవుడికి తిండి ధ్యాస ఎక్కువ. అందుకే వంటల్లో ఎంతో అనుభవం ఉన్న అలకనందుడిని వంటవాడిగా నియమించాడు. ఎన్నో రకాల కొత్త కొత్త వంటలు చేస్తూ అలకనందుడు రాజీవుడికి వండి వడ్డిస్తున్నాడు. రాజు తృప్తి తీరా తిని రకరకాల రుచిల్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడప్పుడు అలకనందుడు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి వంటకాలను నేర్చుకుని వచ్చి, రాజుగారికి కొత్త రుచుల్ని పరిచయం చేస్తూ రోజుకు నాలుగు రకాల వంటలతో భోజనం సిద్ధం చేస్తున్నాడు.   ఈ మధ్య అలకనందుడి వంటల్లో పస తగ్గినట్టు రాజుకు సందేహం వచ్చింది. వెంటనే వంటవాణ్ని పిలిపించాడు.  'ఇంతకాలం నాకు రుచికరమైన వంటకాలు చేసి పెట్టావు. కానీ ఈ మధ్య నీలో వంటలు చేసే ప్రావీణ్యం తగ్గింది. ఏవీ రుచిగా ఉండట్లేదు. నీకిప్పుడు ఒక పరీక్ష పెడతా. నాకు ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకం చేసి పెట్టాలి. లేకపోతే నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది' అని హెచ్చరించాడు రాజు.ఆ మాటలకి ముందుగా అలకనందుడు బయపడిపోయాడు. తర్వాత తేరుకుని 'మహారాజా! మీ ఆనతి ప్రకారం ప్రపంచంలోకెల్లా ఎంతో రుచికరమైన వంటకం వండిపెడతాను. దానికి మీరు ఒక నియమం పాటించాలి. ఆ వంటకం రుచి చూడ్డానికి రెండ్రోజుల వరకు మీరేమీ తినకుండా ఉపవాసం ఉండాలి. లేకపోతే ఈ వంటకం రుచి మీ మీద పని చేయదు' అన్నాడు అలకనందుడు.
  ఆ షరతుకు ఒప్పుకున్నాడు రాజు.  చెప్పినట్లుగానే రెండో రోజు అలకనందుడు ఘుమఘుమలాడుతున్న వంటకాన్ని తయారు చేసి రాజు ముందు పెట్టాడు. రెండ్రోజులు తిండి తిప్పలు లేకుండా ఉపవాసం ఉండి, ఆకలితో కడుపు నకనకలాడుతున్న రాజీవుడు ఆ వంటకాన్ని ఆవురావురంటూ తినేశాడు.  'అబ్బో! అద్భుతం! అమోఘం! చాలా రుచిగా ఉంది అలకనందా! నేనింత వరకు ఇంత గొప్ప వంటకాన్ని తినలేదు' అంటూ మెచ్చుకున్నాడు రాజీవుడు.  'కృతజ్ఞతలు మహారాజా!' అని వంగి వంగి దణ్నాలు పెట్టాడు అలకనందుడు. ఇదంతా గమనిస్తున్న మహామంత్రి వంటవాణ్ని పక్కకి తీసుకెళ్లి అడిగాడు.  'అలకనందా! ఈ వంటకాన్ని ఎక్కడ నేర్చుకొని వచ్చావు? రాజుగారికి అంత బాగా నచ్చింది!' అని అడిగాడు.  'మహామంత్రీ! నన్ను మన్నించండి. ఏ వంటకం రుచి అయినా దాన్ని తినే వారి ఆకలి మీద ఆధారపడి ఉంటుంది. రాజుగారు ఈ మధ్య ఎక్కువసార్లు భోంచేస్తున్నారు. ఒకటి అరగక ముందే మరోటి తినేసరికి ఆయనకు ఏదీ రుచిగా ఉండట్లేదు. అదే ఇప్పుడు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నారు కాబట్టి నేను ఎప్పడూ చేసిన వంటనే అమృతంలా ఉందనుకుంటున్నారు' అని అన్నాడు. అలకనందుడి తెలివికి ఎంతో మెచ్చుకున్నాడు మంత్రి.
 • - చొక్కాపు వెంకటరమణ@ఈనాడు న్యూస్ పేపర్ 
 • ============================================ 

Milkmaid & Priest -పాలు తెచ్చే గొల్లత & పూజారి

 •  
 
 • రామనామ మహిమ

రామాలయంలో ఉన్న పూజారికి ప్రతి ఉదయం ఓ గొల్లత భక్తి శ్రద్ధలతో పాలు తెచ్చి ఇస్తూ ఉండేది. ఓ రోజున ఆమె వేళతప్పి వచ్చింది. 'నేడు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటీ?' అని అడిగాడతడు. 'ఏరు దాటి రావాలికదా బాబూగారూ! పడవవాడు ఆలస్యంగా వచ్చాడు. అందుకే ఇంత జాగు' అంది ఆమె.  అప్పుడా పూజారి 'ఓహో! పడవవాడే వచ్చి ఏరు దాటించాలా ఏమిటీ? రామనామం జపిస్తూ దాటి రాలేకపోయావా?' అన్నాడు పరిహాసంగా.  మరునాటి నుంచీ ఆమె చాలా ముందుగానే వచ్చి పాలు ఇచ్చి వెళ్లసాగింది. 'ఫరవాలేదే! ఇప్పుడు తొందరగానే వచ్చేస్తున్నావే!' అంటూ మెచ్చుకున్నాడు పూజారి.  'మీరు చేసిన ఉపకారమే కదా బాబూ! డబ్బు ఖర్చు లేకుండానే ఏరు దాటే ఉపాయం చెప్పారు' అంది గొల్లత, కృతజ్ఞతాపూర్వకంగా.

'ఉపాయమా? నేను చెప్పానా!' అన్నాడు పూజారి ఆశ్చర్యంగా.  'రామనామ మహిమ గురించి మీరే కదా చెప్పారు నాకు? రామారామా అనుకుంటూ ఏటిమీద నడిచి వచ్చేస్తున్నాను' అంది ఆమె.  ఇలా అంటున్నదేమిటీ అనుకున్నాడతను. 'ఏదీ చూద్దాం పద!' అన్నాడు. ఇద్దరూ ఏటి వద్దకు చేరారు. 'రామరామరామరామ...' అంటూ గొల్లత ఏట్లో దిగింది. నీటి మీద నడుస్తూ ముందుకు సాగింది. ఏటి మధ్యకు వెళ్లి తిరిగి చూసింది.  పూజారి పంచెపైకెత్తి పట్టుకుని, 'రామరామరామ..' అంటూ మోకాటిలోతు నీళ్లలో తూలుతూ నడుస్తున్నాడు.  'మీ మంత్రంపై మీకే నమ్మకం లేదేమిటండీ బాబూ? పంచె తడిసిపోతుందని పైకి మడిచి పట్టుకుని నీళ్లలో దిగి నడుస్తున్నారేమిటీ!' అంటూ పకపకా నవ్వసాగింది గొల్లత.  పూజారి సిగ్గుపడ్డాడు. వెనక్కి తిరిగి ఒడ్డెక్కాడు.

 • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
 • ============================================ 

Way to Treasure-నిధికి దారి

 •  

 • Way to Treasure-నిధికి దారి

గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికిరానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.  'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి. గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా! అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్థులంతా ఓరోజు త్రిగుణయ్యను చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ మండిపడ్డారు.  త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి 'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.  ఆ సన్యాసి కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.  'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.  అంతా విన్న వూరిపెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని పాడుపెట్టుకున్నాం' అన్నాడు. గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగుచేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవరికీ చెప్పలేదు.

 • -కె.కె. రఘునందన@ఈనాడు న్యూస్ పేపర్ 
 • ============================================

No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ? •  No end for hope(Ambition)-ఆశకు అంతెక్కడ?

హిమాలయాలలో నిధి నిక్షేపాలుంటాయని ఎందరో చెబితే, వాటిని సాధించి తెచ్చుకుందామని నలుగురు మిత్రులు బయలుదేరారు. అక్కడ వాళ్లకు ఒక సిద్ధుడు కనిపించాడు. అతడు వాళ్ల ప్రార్థన ఆలకించి, తలా ఓ ఉంగరం వేలికి తొడిగి, 'కొండల్లో, అడవుల్లో తిన్నగా వెళ్లండి. మీ వేలికున్న ఉంగరం ఎక్కడ జారిపడుతుందో, అక్కడ తవ్వండి. ఎవరి ప్రాప్తం ఎలా ఉందో మరి!' అన్నాడు. గునపాలు, గోనె సంచులు పట్టుకుని వాళ్లు కనుమ దారి పట్టారు. అలా రెండు రోజులు నడిచేసరికి ఒకడి ఉంగరం జారి కింద పడింది. వాడు అక్కడ తవ్వాడు. బండెడు రాగి ఇటుకలు కనిపించాయి. 'వీటిని తీసుకెళ్లి అమ్ముకుందాం. చాలా డబ్బొస్తుంది' అన్నాడు. 'మేం ఇంకా ముందుకెళ్తాం' అన్నారు మిగతా వాళ్లు. మొదటివాడు రాగి ముద్దలు తీసుకుని వెళ్లిపోయాడు. ముగ్గురు మిత్రులూ మరో రెండు రోజులు నడవగానే రెండోవాడి ఉంగరం జారిపడింది. అక్కడ తవ్వితే, వెండి దిమ్మెలు బయట పడ్డాయి. వాడు వాటిని తీసుకోగా మిగిలిన ఇద్దరూ ముందుకు సాగారు. తర్వాత మూడోవాడి ఉంగరం జారి పడింది. అక్కడ తవ్వితే బంగారం బయటపడింది. వాడు సంబరపడి, 'ఇద్దరం పంచుకుని వెళ్లిపోదాం!' అన్నాడు. 'నువ్వెళ్లు. నేనురాను! నాకు వెలకట్టలేని మణిమాణిక్యాలు దొరకవచ్చుకదా!' అంటూ నాలుగోవాడు ముందుకు సాగిపోయాడు. వాడు చాలా దూరం నడిచి, ఓ పెద్దలోయ అంచున ఆగాడు. అక్కడ వాడి ఉంగరం జారి ఆ లోయలోకి దొర్లుకుంటూ వెళ్లిపోయింది. లోయ చుట్టూ రాతిగోడల్లా నిటారుగా కొండలు! వాడు అతి కష్టం మీద లోయలోకి దిగాడు. ఎంత వెతికినా ఉంగరం కనిపించలేదు. దుబ్బులా పెరిగిన గడ్డమూ మీసాలతో ఓ పిచ్చివాడు కనిపించాడు. మణులూ మాణిక్యాలూ పొదిగిన ఓ పెద్దచక్రం కళ్లు మిరుమిట్లు గొలుపుతూ, వాడి తల మీద గిరగిరా తిరగుతోంది. ఎటు వెళితే అటు వాడితో బాటే వస్తోంది. 'భయపడకు!' అంటూ దగ్గరికి వచ్చాడు వాడు.  'నేనూ నీలాగా వచ్చిన వాణ్నే! ఇప్పుడు నేను నీకు కనిపించినట్లే, అప్పుడు ఈ చక్రాన్ని నెత్తిన మోస్తూ ఒకడు నాకు కనిపించాడు. వాణ్ని వదిలేసి ఇది నన్ను పట్టుకుంది. మణి మాణిక్యాలు లభించాయన్న సంతోషం క్షణమైనా లేకపోయింది. ఈ చక్రం నెత్తి మీది నుంచి దిగదు. ఇంటికి పోదామంటే చక్రాన్ని మోసుకుంటూ కొండలు ఎక్కలేను. ఎవరొస్తారా అని ఎదురుచూస్తూ, ఆకులలములతో ప్రాణం నిలుపుకుంటున్నాను. నా పాలిట దేవుడిలా ఇన్నాళ్లకు నువ్వొచ్చావు' అంటూ చేతులు మోడ్చాడు.  వెంటనే ఆ చక్రం గిర్రున తిరుగుతూ, నాలుగో మిత్రుడి తలమీదికెక్కింది. వాడు ఆర్తనాదాలు చెయ్యసాగాడు.  'మరేం దిగులు పడకు! మన లాంటి వాడు మరొకడెవడైనా వచ్చి నిన్ను రక్షించేదాకా వేచి చూస్తూ ఉండు!' అని ధైర్యం చెప్పి, ఆ పిచ్చివాడు లోయలోంచి బయటపడ్డాడు.

 • -పునఃకథనం: కలువకొలను సదానంద@ఈనాడు న్యూస్ పేపర్
 • ============================================ 

Wednesday, September 24, 2014

Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

 •  

 • Gift if prooved that is lie-అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి

ఒకానొక రాజు అన్నింటికీ వాగ్వివాదానికి దిగుతుండేవాడు. రాజు కాబట్టి ఆయనేమన్నా అందరూ కిమ్మనేవారు కారు. ఓసారి సభలో 'నేను చెప్పినది అబద్ధమని ఎవరైనా నిరూపిస్తే గొప్ప బహుమతి ఇస్తాను' అన్నాడు రాజు. ఎవరూ మాట్లాడలేదు. విదూషకుడు మాత్రం లేచి 'సరే మహారాజా' అన్నాడు.

'అయితే విను బంగారం బంగారమే. అదెక్కడున్నా దాని విలువ దానిదే. కాదంటావా?' అన్నాడు రాజు నవ్వుతూ. 'అది నిజం కాదు మహారాజా! వస్తువు విలువ దాని స్థానాన్ని బట్టి మారుతుంది' అన్నాడు విదూషకుడు.
'అలా అని నిరూపించగలవా?' అన్నాడు రాజు. 'మీ చేతికున్న బంగారు కడియాన్ని ఇలా ఇవ్వండి ప్రభూ' అన్నాడు విదూషకుడు. రాజు వెంటనే తీసి అందించాడు. విదూషకుడు దాన్ని ఓ భటుడికి ఇచ్చి, 'మన నగరంలో నగల వ్యాపారి మాధవయ్య దగ్గరకి వెళ్లు. అత్యవసరంగా అమ్మాలని చెప్పి ఎంతకి కొంటాడో అడిగిరా' అంటూ పంపాడు.  అలా వెళ్లిన భటుడు కాసేపటికి తిరిగి వచ్చి, 'ఇరవై వరహాలు ఇస్తానన్నాడు ప్రభూ' అన్నాడు. విదూషకుడు ఈసారి ధనాగారం పర్యవేక్షణ అధికారిని పిలిచి కడియం ఇచ్చి 'మాధవయ్య దీన్ని ఎంతకు కొంటాడో కనుక్కో' అని పంపాడు. కాసేపటికి తిరిగి వచ్చిన ఆ అధికారి, 'నలభై వరహాలు ఇస్తానన్నాడు' అన్నాడు. తర్వాత విదూషకుడు దారినపోయే బీదవాణ్ణి పిలిచి ఇంతకు ముందులాగే మాధవుడి దగ్గరకు పంపాడు. అతడి వెంట ఓ సైనికుడిని రహస్యంగా వెంబడించమన్నాడు. వర్తకుడి దగ్గరకు వెళ్లిన బీదవాడు కడియాన్ని ఇచ్చి, 'అయ్యా! దీని ధర ఎంత?' అని అడిగాడు. వర్తకుడు వాడిని ఎగాదిగా చూసి పది వరహాలు వాడి చేతిలో పెట్టి, 'దీన్ని నువ్వు ఎక్కడో దొంగిలించి ఉంటావు. మర్యాదగా ఇది తీసుకుపో. లేదా ఫిర్యాదు చేస్తాను' అంటూ దబాయించాడు. ఆపై సైనికుడి ద్వారా జరిగిందంతా తెలుసుకున్న విదూషకుడు, రాజు కేసి తిరిగి 'చూశారా మహారాజా! ఒకే నగ. ఒకే వర్తకుడు. భటుడికి ఒక విలువ, అధికారికి ఒక వెల, బీదవాడికి ఒక ధర చెప్పాడు. వస్తువు విలువ అది ఉన్న స్థానాన్ని బట్టి మారుతుందని తేలిందిగా?' అన్నాడు. రాజు నవ్వేసి విదూషకుడికి బహుమతి ఇచ్చాడు.

 • -పుప్పాల కృష్ణమూర్తి@ఈనాడు న్యూస్ పేపర్ 
 • ==============================