Showing posts with label Way to Treasure-నిధికి దారి. Show all posts
Showing posts with label Way to Treasure-నిధికి దారి. Show all posts

Thursday, September 25, 2014

Way to Treasure-నిధికి దారి

  •  

  • Way to Treasure-నిధికి దారి

గోకులనాధుడనే సన్యాసి బొద్దాం గ్రామం మీదుగా వెళుతూ రచ్చబండ దగ్గర ఆగాడు. గ్రామస్థులను చూసి, 'అంతులేని నిధినిక్షేపాలను గమనించక దిగాలుగా ఉన్నారేం?' అన్నాడు. ఆ మాటలు విని గ్రామపెద్ద త్రిగుణయ్య 'వూరు పనికిరానిదిగా మారింది. అన్నీ బీడు భూములే. వర్షాలు పడి ఏళ్లయింది. ఇక నిధి నిక్షేపాలు ఎక్కడివి స్వామీ?' అన్నాడు.  'నా దివ్యదృష్టికి అంతా కనిపిస్తోంది. మీలో ఒకరి కళ్లకు అంజనం రాస్తే నిధులెక్కడున్నాయో తెలుస్తుంది' అన్నాడు సన్యాసి. గ్రామస్థులంతా త్రిగుణయ్యకి అంజనం రాయమని కోరారు. సన్యాసి తన జోలె లోంచి ఓ చిన్న భరిణె తీసి అందులోని కాటుకని త్రిగుణయ్యకి రాశాడు. త్రిగుణయ్య వెంటనే 'ఆహా! అద్భుతం. నిధికి దారి స్పష్టంగా కనిపిస్తోంది. తవ్వడమే తరువాయి' అన్నాడు. ఆ మాటలకు గ్రామస్థులంతా సంబరపడి పోయి పలుగు, పార, గునపాలు, తట్టలు పుచ్చుకుని తరలి వచ్చారు. మర్నాడే పని ప్రారంభమైంది. త్రిగుణయ్య చెప్పిన చోట తవ్వుకుంటూ గ్రామస్థులు చెమటోడ్చి పని చేశారు. నిధికి దారి బీడు భూముల మీదుగా వూరికి దాపుల నున్న కొండల మధ్య నుంచి సాగింది. ఓ చోట చివ్వున జలం వూరి పనికి అడ్డం వచ్చింది. కొందరి గ్రామస్థుల చేత దాన్ని దారి మళ్లించాడు త్రిగుణయ్య. ఇలా కొన్నాళ్లయినా నిధినిక్షేపాలు కనిపించలేదు. గ్రామస్థులంతా ఓరోజు త్రిగుణయ్యను చుట్టుముట్టి, 'అసలు నిధికి సరైన దారి ఇదేనా?' అంటూ మండిపడ్డారు.  త్రిగుణయ్య అయోమయంగా మొహం పెట్టి 'పదండి. సంగతేంటో ఆ సన్యాసినే అడుగుదాం' అంటూ వూరందరితో అడవిలో సన్యాసి దగ్గరకు వెళ్లి నిలదీశాడు.  ఆ సన్యాసి కాసేపు కళ్లు మూసుకుని 'నేను చెప్పింది అబద్దం కాదు. పదండి చూపిస్తా' అంటూ ముందుకు నడిచాడు. గ్రామస్థులంతా అనుసరించారు.  'అదిగో చూడండి. మీ తవ్వకాల వల్ల గుక్కెడు నీళ్లు దొరకని గ్రామానికి జలసంపద లభించింది. బీడు భూములన్నీ సారవంతమయ్యాయి. రాజధాని నగరానికి కొండల మధ్య నుంచి దగ్గరి దారి ఏర్పడింది. అన్నింటినీ మించి సోమరులంతా పనిమంతులయ్యారు. ఇవన్నీ నిధినిక్షేపాలు కావా?' అన్నాడు.  అంతా విన్న వూరిపెద్ద త్రిగుణయ్య 'అయ్యా! మీరు చెప్పినవన్నీ నిజమే. ఇన్నాళ్లూ బద్దకస్తులమై గ్రామాన్ని పాడుపెట్టుకున్నాం' అన్నాడు. గ్రామస్థులంతా సిగ్గుపడి తలలు దించుకున్నారు. ఆపై అందరూ పొలాలు సాగుచేసుకుని చక్కగా బతకసాగారు. గ్రామస్థుల సోమరితనాన్ని వదిలించడానికి సన్యాసి సాయంతో అంజనం నాటకమాడినట్టు త్రిగుణయ్య ఎవరికీ చెప్పలేదు.

  • -కె.కె. రఘునందన@ఈనాడు న్యూస్ పేపర్ 
  • ============================================