Tuesday, February 18, 2014

Oldman School,తాత బడి

  •  
  •  
ఆరేళ్ల నానికి తాతయ్యను చూడాలని కోరిక. అమ్మని, నాన్నని అడిగితే తాతయ్య పుట్టిన రోజు నాడు వెళదామని నచ్చజెప్పారు. తాతయ్య పుట్టిన రోజు రానే వచ్చింది. ఉదయం నుంచి నాని హడావుడి ఎక్కువయింది. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాడు. అమ్మ, నాన్న, నాని కారులో బయలుదేరారు.

'తాతయ్యకి డెబ్బయ్యేళ్లు. ఆయన ఎవరినీ గుర్తుపట్టలేక పోతున్నారు. ఒంటరిగా ఆశ్రమంలో ఉంటున్నారు. నీకు మంచి మంచి కథలు చెపుతారు' నానికి చెప్పాడు నాన్న.
ఆశ్రమానికి చేరారు. నానిని చూడగానే తాతయ్య నవ్వుతూ 'బంగారుకొండా! రారా!' అంటూ దగ్గరికి తీసుకుని ముఖాన్ని ముద్దులతో నింపేశాడు. నానికి ఒళ్లు పులకించింది. తాతయ్యను ముద్దు పెట్టుకున్నాడు.

నానిని తన గదిలోకి తీసుకుపోయాడు తాతయ్య. బోలెడు బొమ్మలు, బొమ్మల పుస్తకాలు చూపించాడు. పళ్లెంలో ఉన్న రకరకాల పండ్లు చూపించి 'నీకు కావల్సినవి తీసుకో' అన్నాడు.
తరువాత నానిని భుజాల మీద కూర్చోబెట్టుకుని తోటలోకి తీసుకుపోయి చెట్లు, పిట్టలు చూపించాడు. చెట్ల కథలు, పిట్టల కథలు చెప్పాడు. ఆకాశంలోని మబ్బులు చూపించాడు. మబ్బుల ఆకారాలను చూపించి పాటలు పాడాడు. నానితో పాడించాడు. గాజు తొట్టెలోని రంగురంగుల చేపలను చూపిస్తుంటే, అవి నీటిలో ఈదుతూ ఉంటే చూసి మురిసిపోయాడు నాని.

వాళ్లలా కాసేపు తోటలో దాగుడుమూతలు ఆడారు. దొంగా పోలీసు ఆట ఆడారు. పరుగు పందెంలో నాలుగుసార్లు నాని గెలిచాడు. విజయగర్వంతో గంతులేశాడు నాని.
మధ్యాహ్నం తాతయ్య పుట్టినరోజు కేకుకోసి, నానికి తినిపించాడు. తాతయ్య ఒక బొమ్మల పుస్తకం నానికి బహుమతిగా ఇచ్చాడు. దానిని అపురూపంగా చూసుకున్నాడు నాని. జేబులోంచి కొత్త పదిరూపాయిల నోటు తీసి ఇచ్చి 'ఇది నా గుర్తుగా ఉంచుకో' అన్నాడు తాతయ్య. నాని ఆనందానికి అంతులేదు.

భోజనాలు చేశాక అమ్మ, నాన్నతో కలిసి నాని బయలుదేరాడు. 'తాతయ్యా! నువ్వు నాకు నచ్చావు' అన్నాడు నాని. 'మనవడా! ఇంతకీ నీ పేరు చెప్పనేలేదు' 'నా పేరు నాని, తాతయ్య, నీ పేరు?' అన్నాడు నాని.'నా పేరు తాతయ్యే' అంటూ ముసిముసిగా నవ్వాడు. 'తాతయ్యా! నీ పుట్టిన రోజు బాగా జరిగింది కదా!' 'అవును నానీ! రేపు నీలాంటి మరొక మనవడు వస్తాడు. ఇలా ప్రతిరోజూ నాకు పుట్టినరోజే!' అన్నాడు తాతయ్య. తను నడుపుతున్న 'తాతబడి' అనే వృద్ధాశ్రమం నుంచి వెళ్లిపోతున్న నానిని చూస్తూ, చెమర్చిన కళ్లు తుడుచుకున్నాడు తాతయ్య.

  • - చొక్కాపు వెంకటరమణ@eenadu hai bujji
  • ============================================ 

No comments:

Post a Comment